IND vs USA: న్యూయార్క్‌ పిచ్‌పై ఆడటం తేలిక కాదు.. ఇప్పుడదే బిగ్‌ రిలీఫ్‌: రోహిత్‌

న్యూయార్క్‌లో లీగ్‌ స్టేజ్‌లో భారత్‌ చివరి మ్యాచ్‌ ఆడేసింది. మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమ్‌ఇండియా తదుపరి దశకు చేరుకుంది.

Published : 13 Jun 2024 07:59 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) హ్యాట్రిక్‌ విజయాలు సాధించి గ్రూప్ - A నుంచి భారత్‌ సూపర్ -8లోకి అడుగు పెట్టింది. మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే అందులో చోటు దక్కించుకుంది. యూఎస్‌ఏతో (IND vs USA) జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల టార్గెట్‌ను ఛేదించి 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. కఠినమైన పిచ్‌పై సూర్యకుమార్ (50*), శివమ్‌ దూబె (31*) పరిణతి కనబరిచారని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యానించాడు. అలాగే యూఎస్‌ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత మూలాలు కలిగిన క్రికెటర్లపై ప్రశంసలు కురిపించాడు. 

‘‘ఈ మ్యాచ్‌ అత్యంత క్లిష్టంగా ఉంటుందని తెలుసు. ఇలాంటి పిచ్‌పై 110+ స్కోరైనా మంచి లక్ష్యమే అవుతుంది. అయితే, సూర్యకుమార్‌తోపాటు శివమ్‌ దూబె కీలక భాగస్వామ్యం నిర్మించడంతో మ్యాచ్‌పై పట్టు సాధించాం. ఈ విజయంలో క్రెడిట్‌ అంతా వారిదే. సూపర్ - 8లోకి అడుగు పెట్టడం పెద్ద రిలీఫ్‌. న్యూయార్క్‌ పిచ్‌పై క్రికెట్‌ ఆడటం అంత తేలికేం కాదు. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ ఫలితం మారిపోతుంది. మూడు మ్యాచుల్లోనూ చివరి వరకూ పోరాడాం. దీని వల్ల మరింత ఆత్మవిశ్వాసంతో రెండో స్టేజ్‌కు వెళ్తాం. 

సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌లో తన ఆటకు భిన్నంగా ప్రదర్శన చేశాడు. ఇలాంటి అనుభవం కలిగిన ప్లేయర్ల నుంచి మేం కోరుకొనేదదే. మ్యాచ్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడం అభినందనీయం. తక్కువ స్కోరు నమోదైనప్పటికీ బౌలర్లదే పైచేయి అవుతుంది. కాసేపు ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. సూర్య, దూబె అదే చేశారు. యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ మరోసారి తన సత్తా చాటాడు. బౌలింగ్‌లో మరిన్ని ఆప్షన్లు ఉండటం మంచిదే. అందుకే ఈసారి దూబెతో బౌలింగ్‌ చేయించాం. ఇక యుఎస్‌ఏ కుర్రాళ్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశారు. గతేడాది ఎంఎల్‌సీ (మేజర్‌ లీగ్‌ క్రికెట్)లో వారి ఆటను చూశాం. నిరంతరం మెరుగవుతూ ఉన్నారు’’ అని రోహిత్ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని