IND Vs SA : ఫీల్డింగ్‌లో మాది దారుణమైన ప్రదర్శన : రోహిత్‌

ఫీల్డ్‌లో తమ ప్రదర్శన సరైన విధంగా లేదని రోహిత్‌ శర్మ అన్నాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పాడు.

Updated : 31 Oct 2022 13:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ‘భారత్‌పై దక్షిణాఫ్రికా గెలిచింది.. కాదు కాదు.. టీమ్‌ఇండియానే విజయాన్ని సఫారీలకు పువ్వుల్లో పెట్టి అందించింది..’ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్నటి మ్యాచ్‌లో రోహిత్‌ సేన ప్రదర్శన చూసిన అభిమానులు ఇలాంటి విమర్శలే చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకుని.. ఫీల్డింగ్‌ తప్పిదాలతో తడబడ్డ భారత్‌..  5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందిస్తూ.. ఈ తప్పిదాలను అంగీకరించాడు. ఫీల్డింగ్‌లో తమ జట్టు దారుణమైన ప్రదర్శన చేసిందని అన్నాడు.

‘ఫీల్డ్‌లో మా ప్రదర్శన సరైన విధంగా లేదు. గతంలో మేం ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఆడాం. కాబట్టి పరిస్థితులను మా ఓటమికి కారణంగా చెప్పి తప్పించుకోలేం. మా ప్రదర్శన నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. నాతో పాటు మేం కొన్ని రనౌట్‌లను మిస్‌ చేశాం’ అని రోహిత్‌ విచారం వ్యక్తం చేశాడు.

ఇక అశ్విన్‌తో 18వ ఓవర్‌ వేయించడంపై కూడా కెప్టెన్‌ స్పందించాడు. ‘స్పిన్నర్లతో చివరి ఓవర్లను వేయిస్తే ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే చివరి ఓవర్‌కు ముందే అశ్విన్‌తో బౌలింగ్‌ చేయించాలనుకున్నా. సీమర్లతో సరైన ఓవర్లు వేయించాలనుకున్నాను. కొత్త బ్యాటర్‌ రావడంతో.. అశ్విన్‌ బౌలింగ్‌ చేయడానికి ఇదే సరైన సమయమని భావించాను’ అని వివరించాడు.

నిన్నటి మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను రోహిత్‌ సేన చేజార్చుకున్న విషయం తెలిసిందే. జోరుమీదున్న మార్‌క్రమ్‌.. 12వ ఓవర్లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఇచ్చిన ఓ తేలికైన క్యాచ్‌ను డీప్‌ మిడ్‌వికెట్‌లో కోహ్లి విడిచిపెట్టాడు. ఇక 13వ ఓవర్లో మార్‌క్రమ్‌ను రనౌట్‌ చేసే చక్కని అవకాశాన్ని రోహిత్‌ వృథా చేశాడు. అతి సమీపం నుంచి కూడా అతడు స్టంప్స్‌ను కొట్టలేకపోయాడు. సూర్యకుమార్‌ సరిగ్గా త్రో చేసి ఉంటే 9వ ఓవర్లో కూడా మార్‌క్రమ్‌ ఔటయ్యేవాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ నిన్న తొలి పరాజయాన్ని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని