Rohit Sharma: ఆ రెండు అంశాలే.. తుది జట్టులో మార్పులకు కారణం: రోహిత్ శర్మ

సూపర్-8 పోరును భారత్ ఘనంగా ప్రారంభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో రాణించి ప్రత్యర్థిని కట్టడి చేసి విజయం సాధించింది.

Published : 21 Jun 2024 08:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సూపర్‌-8లో భారత్‌ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని నమోదు చేసింది. అఫ్గాన్‌తో జరిగిన పోరులో 47 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (53) హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ 181/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బుమ్రా (3/7), అర్ష్‌దీప్‌ సింగ్ (3/36) దెబ్బకు అఫ్గాన్‌ 134 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. 

‘‘రెండేళ్ల కిందట విండీస్‌లో టీ20లు ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందించాం. తొలుత బ్యాటింగ్‌లో 180+ స్కోరు చేశాం. మిడిలార్డర్‌ బ్యాటర్లు గొప్ప పరిణతి చూపించారు. సూర్యకుమార్-హార్దిక్ పాండ్య భాగస్వామ్యం కీలకం. చివరి వరకూ ఒక బ్యాటర్‌ క్రీజ్‌లో ఉండాలనుకున్నాం. మేం విధించిన లక్ష్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతమైన బౌలింగ్ దళం ఉంది. బుమ్రా సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. బాధ్యత తీసుకొని జట్టుకు అండగా నిలుస్తాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపైనా చర్చించుకున్నాం. ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో మార్పులు చేయాలని భావించాం. ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం సరైన నిర్ణయమే. ఒకవేళ పిచ్‌ సీమర్లకు అనుకూలంగా ఉంటే వారినే తీసుకుంటాం. ఏదైనా జట్టు అవసరాలకు తగ్గట్టుగా అంతా సిద్ధంగా ఉంటారు’’ అని రోహిత్ స్పష్టం చేశాడు. 

ఛేదించగలమని భావించాం: రషీద్‌ ఖాన్

‘‘ఇలాంటి పిచ్‌పై 180 పరుగులను ఛేదించవచ్చని భావించాం. పెద్ద జట్లపై ఇలాంటి లక్ష్యాలను ఛేదించే క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మళ్లీ బౌలింగ్‌లో లయను అందుకోవడం ఆనందంగా ఉంది. ఐపీఎల్‌ చివర్లో కాస్త ఇబ్బంది పడ్డా. టీ20 ప్రపంచ కప్‌ లీగ్‌ స్టేజ్‌లోనూ కొనసాగింది. ఇప్పుడు భారత్‌పై కీలకమైన వికెట్లు తీయడంతో దారిలో పడినట్లే. పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆడాల్సిన అవసరం ఉంది’’ అని అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు