T20 World Cup 2024: రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్

అమెరికా జట్టులోని కొంతమంది భారత సంతతి ఆటగాళ్లు జూనియర్‌ లెవల్‌లో ఇండియా తరఫున బరిలోకి దిగారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో కీలకంగా ఉన్న కొంతమంది ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు. 

Published : 14 Jun 2024 00:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని  ఛేదించడానికి భారత్‌ ఆపసోపాలు పడింది. 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లకు కానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఏ ఫార్మాట్‌లో అయినా రెండు జట్ల మధ్య ఇదే మొదటి మ్యాచ్. అమెరికా జట్టులో సగానికిపైగా భారత సంతతి ఆటగాళ్లు ఉండటం, పొట్టి కప్‌లో ఆ జట్టు రాణిస్తుండటంతో భారత్, యూఎస్ఏ మ్యాచ్‌ను అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. అమెరికా జట్టులోని కొంతమంది భారత సంతతి ఆటగాళ్లు జూనియర్‌ లెవల్‌లో ఇండియా తరఫున బరిలోకి దిగారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో కీలకంగా ఉన్న కొంతమంది ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌ చాట్‌లో అమెరికా ఆటగాళ్లు సౌరభ్‌ నేత్రావల్కర్‌, హర్మీత్‌ సింగ్, మోనాంక్ పటేల్ టీమ్‌ఇండియా ప్లేయర్స్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘నేను రోహిత్ శర్మను చూస్తూ పెరిగాను. మా ఇద్దరిది ఒకే స్కూల్‌. నేను పాఠశాలలో చేరినప్పుడు రోహిత్‌ పట్టభద్రుడయ్యాడు. నా ఫస్ట్ క్లాస్ అరంగేట్ర మ్యాచ్‌లో రోహిత్‌ కూడా ఉన్నాడు. అతడు నాకంటే ముందు అండర్-19 ప్రపంచకప్‌ వంటి కొన్ని టోర్నమెంట్‌లలో ఆడాడు. ముంబయి ఆటగాళ్లు అంతర్జాతీయస్థాయిలో అదరగొడుతుండటంతో ఆనందంగా ఉంది. రోహిత్ శర్మను అనుసరిస్తూ మేం అందరం క్రికెట్‌లోకి అడుగుపెట్టాం. ఇండియా తరఫున అండర్-19లో సంజు శాంసన్, కుల్‌దీప్ యాదవ్‌, అక్షర్ పటేల్‌తో కలిసి ఆడా. ఇప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాడిగా వారితో ఆడటం ఎంతో సరదాగా ఉంటుంది’’ - హర్మీత్‌ సింగ్ 

‘‘సూర్యకుమార్ నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్. అండర్-15 రోజుల నుంచి నేను అతనిని చూస్తున్నాను. సూర్యకుమార్‌ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవాడు. అండర్-15, అండర్-17లో అతడు డబుల్ సెంచరీలు చేశాడు. నేను ఊహించిన దానికంటే చాలా ఆలస్యంగా భారత్‌ తరఫున ఆడాడు. కానీ, అతడి ఆటతీరుపై చాలా సంతోషంగా ఉన్నా. సూర్యకుమార్‌ను కలుసుకోవడంతో ఆనందంగా ఉంది’’ - నేత్రావల్కర్ 

‘‘నేను అండర్-15, అండర్-19 మ్యాచ్‌లలో అక్షర్ పటేల్‌, బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్ నేను ఒకే పట్టణం (ఆనంద్, గుజరాత్‌) నుంచి వచ్చాం. అక్షర్ అక్కడ చాలామంది యువకులను ప్రోత్సహించాడు. అతడు ఎదుగుతున్నందుకు సంతోషిస్తున్నాను’’ - మోనాంక్ పటేల్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని