Mohammed siraj: సిరాజ్‌, శ్రేయస్‌, రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డులు!

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా భారత ఆటగాళ్లు రోహిత్‌ శర్మ(Rohit sharma), మహమ్మద్‌ సిరాజ్‌(Mohammed siraj), శ్రేయస్‌ అయ్యర్ అరుదైన రికార్డులు సాధించారు. 

Updated : 09 Dec 2022 13:22 IST

దిల్లీ:  బంగ్లాదేశ్‌(Bangladesh)తో రెండో వన్డేలో టీమ్‌ఇండియా(Team india) ఓటమిని చవిచూసినప్పటికీ ఈ మ్యాచ్‌తో భారత ఆటగాళ్లు అరుదైన రికార్డులను అందుకున్నారు . బుధవారం టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌(Mohammed siraj) ఖాతాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది తన బౌలింగ్‌తో పవర్‌ప్లేతో పాటుగా డెత్‌ ఓవర్లలోనూ సిరాజ్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పొదుపుగా బంతులేస్తూ రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్‌ కుర్రాడు.. 2022లో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు.  తాజాగా బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలోనూ సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్‌ను సిరాజ్‌ అధిగమించాడు.

మరోవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా జట్టును గెలిపించడానికి ఆఖరి వరకూ పోరాడిన రోహిత్‌ శర్మ(Rohit sharma) కూడా అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 (ఇప్పటివరకు మొత్తం సిక్సులు 502) సిక్సులు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా చూసుకుంటే వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ 553 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

శ్రేయస్‌ ఖాతాలోనూ..

నిలకడైన ఆటతీరుతో జట్టుకు సానుకూలంగా మారిన బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌. తాజాగా వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 1,500 పరుగుల మైలురాయిని దాటిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తం వన్డే కెరీర్‌లో ఈ ఆటగాడు 38 మ్యాచుల్లో 34 ఇన్నింగ్స్‌లు ఆడాడు. యావరేజీ 49.48తో ఇప్పటివరకు 1,534 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి. గతంలో 36 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్‌ రాహుల్‌  1500 మార్క్‌ను అందుకోగా.. ఇప్పుడు అయ్యర్ దానిని అధిగమించాడు. విరాట్ కోహ్లీ (38), శిఖర్‌ ధావన్‌ (38)ని కూడా శ్రేయస్‌ దాటేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని