Rohit Sharma: ఈ సీజన్‌లో మా జట్టులో అదే లోపించింది: రోహిత్

ముంబయి మరో పేలవమైన ప్రదర్శన చేసింది. దీంతో మరో ఓటమి చవిచూసింది. గతరాత్రి కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కూడా చేరలేక 113 పరుగులకే కుప్పకూలింది...

Published : 10 May 2022 09:53 IST

ముంబయి: ముంబయి మరో పేలవమైన ప్రదర్శన చేసింది. దీంతో మరో ఓటమి చవిచూసింది. గతరాత్రి కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కూడా చేరలేక 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తమ బ్యాటింగ్‌ తీరుతో తీవ్ర నిరాశకు గురైనట్లు చెప్పాడు. తమ బౌలింగ్‌ యూనిట్‌ అద్భుతంగా రాణించినా బ్యాటింగ్‌ దెబ్బతీసిందని పేర్కొన్నాడు.

‘మా బౌలింగ్‌ యూనిట్‌ చాలా గొప్ప ప్రదర్శన చేసింది. బుమ్రా మరింత గొప్పగా మెరిశాడు. అయితే, మేం బ్యాటింగ్‌ చేసిన తీరుకు చాలా నిరాశ చెందా. బ్యాట్స్‌మన్‌ ఏమాత్రం ఆడలేకపోయారు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత కష్టమేం కాదు. ఈ స్టేడియంలో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడిన నేపథ్యంలో పిచ్ ఎలా స్పందిస్తుందో అవగాహన ఉంది. ఇలాంటి లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మంచి భాగస్వామ్యాలు కావాలి. కానీ, మేం అది చేయలేకపోయాం. కోల్‌కతా తొలి 10 ఓవర్లలో సుమారు 100 పరుగులు చేసింది. అయినా, మేం తిరిగి పుంజుకోవడం గొప్ప విషయం. బుమ్రా ప్రత్యేకంగా నిలిచాడు. ఈ సీజన్‌లో మా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో నిలకడ లోపించినట్లు ఉంది’ అని రోహిత్‌ వివరించాడు.

పూర్తి సంతృప్తిగా లేను: శ్రేయస్‌

ఇక ముంబయిపై విజయం సాధించడం తనకు పూర్తి సంతృప్తినివ్వలేదని కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. ‘గత మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమిపాలై ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవడం బాగుంది. ఇలా విజయాలు సాధిస్తే బాగుంటుంది. ఈ మ్యాచ్‌లో మేం అద్భుతంగా ఆడాం. పవర్‌ప్లేలో వెంకటేశ్‌ అయ్యర్‌ రాణించాడు. ముంబయి బౌలర్లను టార్గెట్‌ చేసుకున్నాడు. ఇక మేం బౌలింగ్‌ చేసేటప్పుడు కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు షాట్లు ఆడే అవకాశం ఇవ్వద్దనుకున్నాం’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు. అలాగే కొన్నిసార్లు తుది జట్టులో నుంచి కొంత మంది ఆటగాళ్లను పక్కనపెట్టడం చాలా కష్టమని, కొన్నిసార్లు కోచ్‌, జట్టు యాజమాన్యం కూడా తుది జట్టు ఎంపికలో పాలుపంచుకుంటారని చెప్పాడు. అయితే, తమ ఆటగాళ్లు అర్థం చేసుకుంటారన్నాడు. ఇది మంచి విజయమే అయినా తాను పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేనన్నాడు. కానీ, ఇలాంటి విజయాలు మున్ముందు కూడా సాధించాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని