IND vs AUS: ఆసీస్‌తో చివరి రెండు టెస్టుల్లోనైనా బుమ్రా ఆడతాడని ఆశిస్తున్నాం: రోహిత్‌

వరుసగా వన్డేలు, టీ20 సిరీస్‌లను ఆడుతున్న టీమ్‌ఇండియా (Team India) ఫిబ్రవరి నుంచి ఆసీస్‌తో టెస్టు (IND vs AUS) సిరీస్‌ను ఆడనుంది. అయితే బుమ్రా పునరాగమనంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

Published : 25 Jan 2023 17:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ ముగిసింది. శుక్రవారం నుంచి మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. అనంతరం దాదాపు వారం రోజులపాటు భారత ఆటగాళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమ్‌ఇండియా నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే గాయం కారణంగా చాలా రోజులనుంచి విశ్రాంతి తీసుకొంటున్న కీలక బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రాను తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. సిరీస్‌ ముగిసేనాటికైనా అందుబాటులోకి వస్తాడా..? లేదా..? అనే అనుమానం తలెత్తింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ప్రస్తుతం బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీలో నెట్‌ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 

‘‘బుమ్రా విషయంలో కచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నా. ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకైనా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నా. అయితే దీనికోసం ఎలాంటి రిస్క్‌ తీసుకోవడం లేదు. వెన్నునొప్పి ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. ఈ టెస్టు సిరీస్‌ తర్వాత మనం చాలా క్రికెట్‌ ఆడాల్సి ఉంది. జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఎప్పటికప్పుడు వైద్యబృందం, ఫిజియోతో తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. బుమ్రాకు కావాల్సినంత సమయం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అందుకే అతడిపై ఎలాంటి ఒత్తిడి పెట్టదల్చుకోలేదు’’ అని రోహిత్ వెల్లడించాడు. 

గతేడాది సెప్టెంబర్‌లో వెన్ను గాయం తిరగబెట్టడంతో బుమ్రా ఆసియా కప్‌తోపాటు ప్రపంచ కప్‌ టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌ల్లోనూ ఆడలేకపోయాడు. తొలుత శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. ఎన్‌సీఏ వైద్య బృందం సూచనల మేరకు విశ్రాంతినిస్తు బీసీసీఐ నిర్ణయం తీసుకొంది. ఈ క్రమంలో ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు