Rohit Sharma: అలా ఎంపిక చేయం.. ఇప్పటికే లైన్‌లో చాలా మంది ప్లేయర్లు: రోహిత్‌

టీమ్‌ఇండియా (Team India)లోకి రావడమంటే సాధారణ విషయం కాదు. టాలెంట్‌తోపాటు అదృష్టమూ కలిసిరావాలి. భారీగా పరుగులు సాధించినా సరే.. జట్టులో స్థానం కోసం మాత్రం కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే వచ్చిన ఛాన్స్‌ను మాత్రం వదులుకోకుండా రాణిస్తేనే జట్టులో స్థానం సుస్థిరమవుతుంది.

Updated : 26 Jan 2023 19:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) కోసం జట్టు సన్నద్ధతపై భారత్‌ (Team India) కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో జరిగే పెద్ద టోర్నమెంట్‌లను దృష్టిలో పెట్టుకొనే ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని రోహిత్ వెల్లడించాడు. జట్టులోకి వచ్చేందుకు చాలామంది ప్లేయర్లు లైన్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ గాయం వల్ల.. కేఎల్ రాహుల్‌ వ్యక్తిగత కారణాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం వచ్చింది. అందులో గిల్‌ ఓపెనర్‌గా వచ్చి అదరగొట్టేశాడు. సూర్యకుమార్‌ లోయర్‌ ఆర్డర్‌లో రావడంతో ఇప్పటి వరకు పెద్ద ఇన్నింగ్స్‌లేమీ ఆడలేదు. అయితే ఎలాంటి సమయంలోనైనా రాణించగల సత్తా అతడిలో ఉంది. అలాగే రజత్ పటీదార్‌ను ఎంపిక చేసినప్పటికీ.. రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీనిపై ఎదురైన ప్రశ్నకు రోహిత్‌ ఇలా సమాధానం ఇచ్చాడు. 

‘‘రజత్‌ను ఏ స్థానంలో ఆడించాలనే దానిపై స్పష్టత రావాలంటే.. అతడి కోసం ఖాళీని అన్వేషించాలి. అప్పుడే జట్టులోకి తీసుకోగలం. ఇప్పుడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో వస్తున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య.. వరుసగా నాలుగైదు ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తున్నారు. అందరినీ ఆడించాలని మాకు ఉంటుంది. కానీ సరైన స్థానమే దొరకడం లేదు’’ 

న్యూజిలాండ్‌తో ఇండోర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనైనా రజత్‌ను ఆడిస్తే బాగుండేదని వ్యాఖ్యలపైనా స్పందించాడు. ‘‘ఇండోర్‌లో ఆడించాల్సి కదా అని మాకూ అనిపిస్తుంది. అలాగే రాంచీ వేదికగా ఇషాన్‌ కూడా ‘నన్ను ఆడించండి’ అని అనొచ్చు. అయితే మేం మా ప్రణాళికల ప్రకారం నడుచుకుంటాం. అంతేకానీ ఇలాంటి పద్ధతి సరైంది కాదని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇదే విషయం యువకులకూ చెబుతుంటాం. ఎప్పుడైనా సరే ఆడేందుకు అవకాశం ఇస్తాం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే చాలామంది తమవంతు కోసం ఎదురు చూస్తూ లైన్‌లో ఉన్నారు’’ అని రోహిత్ వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు