Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్‌ జట్టుపై నో డౌట్స్: రోహిత్

మూడో వన్డేలో ఓడినా మెగా టోర్నీలో మా ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం ఉండదని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు.

Published : 28 Sep 2023 08:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ (IND vs AUS) పరాజయం చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఇబ్బందేం లేదని.. కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌ చేతిలో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయినా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. టైటిల్‌ను అందుకున్న తర్వాత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘వ్యక్తిగతంగా నా ప్రదర్శన పట్ల ఆనందంగా ఉంది. అన్ని విధాలుగా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌లు ఆడాలనేదే నా లక్ష్యం. గత ఏడెనిమిది వన్డేల్లో మా ఆటతీరు పట్ల సంతృప్తిగానే ఉన్నాం. విభిన్న పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. వేర్వేరు జట్లతో బరిలోకి దిగాం. కఠిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ముందుడుగు వేశాం. దురదృష్టవశాత్తూ మూడో వన్డేలో ఓడిపోయాం. అయినా ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శనే చేశాం.

IND vs AUS: ఆఖరిది ఆసీస్‌కు

పేసర్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగొచ్చిన తర్వాత అతడి ఆటతీరు అద్భుతం. అతడు బౌలింగ్‌లో లయను అందుకోవడంతో భారత్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. బ్యాటింగ్‌ పిచ్‌ అయినా సరే బుమ్రా బౌలింగ్‌ ఆకట్టుకుంది. ఆరంభంలో కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చినా తర్వాత నియంత్రించాడు. మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి. ఒక మ్యాచ్‌లో పరుగులు ఇచ్చినంత మాత్రాన సమస్యేమీ కాబోదు. ఇక వరల్డ్‌ కప్‌ గురించి అంతా అడుగుతుంటారు. జట్టులోకి ఎవరు వస్తారు? ఏవైనా మార్పులు ఉంటాయా? అని అందరిలోనూ సందేహాలు రావడం సహజం. అయితే, వరల్డ్‌ కప్‌ కోసం 15 మందిపై మాకు పూర్తి స్పష్టత ఉంది. ఇందులో ఎలాంటి అయోమయం లేదు. తప్పకుండా అద్భుతమైన జట్టుతోనే బరిలోకి దిగుతాం. ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే మనం ఛాంపియన్‌గా నిలవగలం’’ అని రోహిత్ అన్నాడు.

మరికొన్ని విశేషాలు..

  • రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ సిక్స్‌ల సంఖ్య 551కి చేరింది. మరో మూడు కొడితే క్రిస్ గేల్‌ను అధిగమిస్తాడు. ప్రస్తుతం గేల్ 553 సిక్స్‌లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
  • రాజ్‌కోట్‌ వేదికగా ప్రతి నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్‌ను తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. ఇప్పుడు ఆసీస్‌ కూడా మొదట బ్యాటింగ్‌లో 350+ స్కోరు చేసింది.
  • భారత్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు నమోదైన ఐదో మ్యాచ్‌ ఇదే. ఆసీస్‌-భారత్ కలిసి 638 పరుగులు సాధించాయి. అయితే ఇరు జట్లలో ఒక్కరూ శతకం చేయలేదు. మిచెల్ మార్ష్‌ (96) టాప్‌ స్కోరర్.
  • వన్డేల్లో ఆసీస్‌ స్పిన్నర్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో గ్లెన్‌ మాక్స్‌వెల్ నాలుగో ఆటగాడు.  షేన్ వార్న్ అందరికంటే ఎక్కువగా 13సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. మాక్స్‌వెల్‌కు (4/40) ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
  • జస్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో అత్యధికంగా పరుగులు సమర్పించడం ఇది రెండోసారి. అతడు ఆసీస్‌పై తన పది ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 81 పరుగులు సమర్పించాడు. గతంలో (2017లో) ఇంగ్లాండ్‌పై 2/81 ప్రదర్శన చేశాడు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని