Rohit Sharma : డెత్‌ ఓవర్లపై రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే..?

నిర్ణయాత్మక పోరులో అద్భుత ప్రదర్శన చేసి రోహిత్‌ సేన సిరీస్‌ను కైవసం చేసుకోవడంతోపాటు టీ20 ప్రపంచకప్‌ ముందు

Updated : 26 Sep 2022 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  నిర్ణయాత్మక పోరులో అద్భుత ప్రదర్శన చేసి రోహిత్‌ సేన సిరీస్‌ను కైవసం చేసుకోవడంతోపాటు టీ20 ప్రపంచకప్‌ ముందు తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. నిన్న హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అన్ని విభాగాల్లో రాణించినప్పటికీ.. టీమ్‌ఇండియాను ఇప్పటికీ డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆసియా కప్‌లోనూ ఇదే దెబ్బకొట్టగా.. ఆసీస్‌తో తొలి మ్యాచ్‌లోనూ ఓటమికి ఇదో కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అంగీకరించాడు.

ఆదివారం నాటి మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా..? అన్న ప్రశ్నకు స్పందించాడు. ‘చాలా అంశాలున్నాయి. ముఖ్యంగా మా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌. వచ్చే నెలలోనే టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇది ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది’ అని అన్నాడు. అయితే.. ఈ విషయంలో బౌలర్లు త్వరలోనే గాడినపడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘వారిద్దరూ(హర్షల్‌ పటేల్‌, బుమ్రా) చాలా కాలం తర్వాత జట్టుకు ఆడుతున్నారు. ఆసీస్‌ మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌కు బౌలింగ్‌ చేయడం కష్టమే అని తెలిసినందున నేను నిజంగా దానిని పట్టించుకోను. వారు విరామం తర్వాత వచ్చినందున.. కాస్త సమయం తీసుకుంటారు. వారు తిరిగి గాడిలో పడతారని ఆశిస్తున్నా’ అని రోహిత్‌ వివరించాడు. ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం సాధించినందుకు మొత్తంగా జట్టు ప్రదర్శనపై సారథి సంతృప్తి వ్యక్తం చేశాడు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేయగా..  ఛేదనలో రోహిత్‌ సేన 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని