rohit sharma: వాళ్లు ఆడుతుంటే చూడటం బాగుంది: రోహిత్‌ శర్మ

పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా జట్టును విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ గట్టున పడేసింది.

Published : 27 Sep 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో మూడు సిరీస్‌ల టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ చివరి మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అప్పటికే పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా జట్టును విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ గట్టున పడేసింది. మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యంతో వీరు జట్టును విజయపథంలో నడిపించారు. ఈ మ్యాచ్‌తో హీరోలుగా మారిన ఈ ఆటగాళ్లను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలతో ముంచెత్తాడు. 

‘‘ఆటలో సూర్యకుమార్‌ సామర్థ్యం మనందరికీ తెలుసు. గ్రౌండ్‌ మొత్తం అతడు షాట్స్‌ ఆడగలడు. అదే తన ప్రత్యేకత.  మ్యాచ్‌ మొత్తాన్ని ఒకే రకమైన బ్యాటింగ్‌తో నడిపించాడు. తనకు అవకాశం లభించిన ప్రతిసారి కీలకమైన ఇన్నింగ్స్‌ను అందించాడు. తన ఆటతీరుతో మ్యాచ్‌ను ఉన్నతంగా నిలబెడతాడు. ఒక ఆటగాడికి ఇది ఉండాల్సిన లక్షణం. ఈరోజు అతడు అసాధారణంగా ఆడాడు. పవర్‌ప్లేలో మేమిద్దరం తక్కువే. తన ఆటతీరుతో ప్రత్యర్థిని గెలుపుకు దూరం చేయడం చాలా గొప్ప విషయం. సూర్యకుమార్‌తో విరాట్‌ కోహ్లీది కీలకమైన భాగస్వామ్యం. వీరి లాంటి బ్యాట్స్‌మెన్లు జట్టుకు దొరకడం గొప్ప విషయం. రెండు వికెట్లు నష్టపోయిన తర్వాత 180 పరుగులు తీయడం అంటే అంత తేలికేమీ కాదు. కానీ వారు ప్రశాంతంగా తమ పని పూర్తి చేశారు. వీరి ఆట చూడటానికి చాలా బాగుంది’’ అంటూ మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. 

జట్టు పేసర్లు హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ పేలవమైన ఆటతీరుతో విమర్శలు రావడంపైనా రోహిత్‌ స్పందించాడు. ‘‘గాయాల నుంచి కోలుకున్న తర్వాత తిరిగి రాణించడం చాలా కష్టం. హర్షల్‌ రెండు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ మూడు సిరీస్‌ల ఆధారంగా అతడి సామర్థ్యాన్ని మేము లెక్కించడం లేదు. అతడి గురించి మాకు తెలుసు. గతంలో టీమ్‌ కోసం ఎంతో కఠినమైన ఓవర్లను ఆడాడు. తనెప్పుడూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. తన తప్పుల నుంచి కచ్చితంగా నేర్చుకుంటాడు. భువనేశ్వర్‌ కుమార్‌ అంచనాలకు తగ్గ ఆటతీరు కనబరచలేదు. కానీ అది సహజం. డెత్‌ ఓవర్లలో అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తాం. తనలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. అది అలాగే ఉంది. గత వైఫల్యాల నుంచి అతడు తిరిగి పుంజుకోవడం మేము చూడాలనుకుంటున్నాం’’ అని తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని