Rohit On WC 2023: మా టార్గెట్‌ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్

స్వదేశం వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) గురువారం నుంచి ప్రారంభం కానుంది. గత మూడు పర్యాయాల సెంటిమెంట్‌ను ఈసారి కూడా టీమ్‌ఇండియా కొనసాగిస్తుందా..? లేదా..? అనేది అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. 

Published : 04 Oct 2023 17:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ‘గత మూడు పర్యాయాలు ఆతిథ్య దేశమే వరల్డ్‌ కప్‌ను (ODI World Cup 2023) నెగ్గిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమవుతుందా..?’ ఇదీ టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మను మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అడిగిన ప్రశ్న. పది జట్ల సారథులతో ఐసీసీ నేతృత్వంలో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం జరిగింది. దానికి వ్యాఖ్యాతగా రవిశాస్త్రి వ్యవహరించాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి అడిగిన ఆ ప్రశ్నకు రోహిత్ శర్మ సమయోచిత సమాధానం ఇచ్చాడు. ఇదే కాకుండా గత వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఫలితంపైనా రోహిత్ స్పందించాడు. 

భారత్‌ వేదికగా జరగడంపై.. 

స్వదేశంలో మ్యాచ్‌లు జరగనుండటం ఆనందంగానే ఉంది. అయితే, ఇదేమీ తమకే ప్రయోజనమవుతుందని మాత్రం భావించడం లేదు. గత మూడు వరల్డ్‌ కప్‌లను ఆతిథ్య జట్లే గెలిచాయి. అయితే, ఈసారి కూడా గెలుస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజమే. కానీ మేము మాత్రం మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టిసారించాం. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తాం. అప్పుడే ఉత్తమ ఫలితాలను రాబట్టగలం. భారత్‌లో మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ ఉంటుంది. గొప్ప టోర్నీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. 

వార్మప్‌లు రద్దు కావడం..

ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లతో వార్మప్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే, వరుసగా పర్యటనలు చేసి వేడి వాతావరణం ఎదుర్కొని వచ్చిన మాకు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. మెగా టోర్నీకి ముందు చాలా క్రికెట్‌ ఆడాం. ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల  సిరీస్‌ను ఆడటం కలిసొస్తుంది. ఇప్పుడు వాతావరణం ఇలా ఉండటంపై మరీ ఆందోళనగా ఏమీ లేదు. భారత్‌లో వేర్వేరుగా వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం.

గత వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఫలితంపై..

వన్డే ప్రపంచకప్‌ 2019 టోర్నీ ఫైనల్‌లో బౌండరీల ఆధారంగా ఫలితం వెలువరించడం జరిగింది. న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. అయితే, ఫలితం నిర్ణయంపై స్పందించడం సరైంది కాదు. అది నేను నిర్వర్తించే బాధ్యత కూడా కాదు. అందుకోసం ప్రత్యేక యంత్రాంగం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని