Rohit Sharma: 5 రోజుల్లో 3 మ్యాచ్‌లు.. భారత్ కెప్టెన్‌ రోహిత్ కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ ‘సూపర్‌-8’ దశకు చేరుకుంది. లీగ్‌ స్టేజ్‌లో అదరగొట్టిన టాప్‌ ఎనిమిది టీమ్‌లు సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చాయి.

Updated : 18 Jun 2024 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్ సూపర్-8 పోరును అఫ్గానిస్థాన్‌తో (IND vs AFG) గురువారం నుంచి ప్రారంభించనుంది. ఇప్పటివరకు యూఎస్‌ఏ పిచ్‌లపై ఆడిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు విండీస్‌ వేదికగా జరిగే మ్యాచుల్లో తలపడనుంది. ఐదు రోజుల వ్యవధిలో మూడు మ్యాచులు ఆడటంపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. అయితే, దీనిని తాము సాకుగా చూపమని స్పష్టం చేశాడు. 

‘‘లీగ్‌ స్టేజ్‌ నుంచి ఇప్పుడు కీలకమైన సూపర్‌-8కి చేరాం. ఇక్కడ ఇంకాస్త వైవిధ్యంగా ఆడాల్సి ఉంటుంది. కఠినమైన ప్రత్యర్థులను ఢీకొట్టనున్నాం. అందుకోసం మా ప్రాక్టీస్‌ సెషన్లను కూడా సీరియస్‌గా తీసుకున్నాం. ప్రతి స్కిల్ సెషన్‌లోనూ టార్గెట్‌ పెట్టుకుని దానిని అందుకొనేందుకు ప్రయత్నించాం. ఇక సూపర్-8లో ఒక్కసారి బరిలోకి దిగాక.. స్వల్ప వ్యవధిలో కీలక మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. ఇది కాస్త హడావుడిగా ఉన్నట్లు అనిపించినా.. తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మ్యాచ్‌ల కోసం ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, దీనిని సాకుగా మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడు ఆడినా విజయం కోసం వందశాతం కష్టపడతాం. ఇప్పటివరకు మేమంతా జట్టుగా ఆడాం. ఇక సూపర్-8లోనూ ఇదే బాధ్యతతో ముందుకుసాగుతాం. విండీస్‌లో ఆడిన అనుభవం కూడా మాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. మా బలాలపై దృష్టిపెట్టి.. ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తాం. ప్రతిఒక్కరూ తమ సత్తా చాటేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు’’ అని రోహిత్ తెలిపాడు.

తీవ్రంగా శ్రమిస్తున్న విరాట్

ఇప్పటివరకు నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైన విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్‌-8 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతడితోపాటు రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. విండీస్‌లో స్పిన్నర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. సూపర్‌-8లో అఫ్గాన్‌తో జూన్ 20న, బంగ్లాదేశ్‌తో జూన్ 22న, ఆసీస్‌తో జూన్ 24న టీమ్‌ఇండియా తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు