Rohit Sharma : అలాంటి వ్యాఖ్యలను అంగీకరించను.. ప్రతి ఒక్కరినీ సిద్ధం చేస్తాం: రోహిత్

వెస్టిండీస్‌ పర్యటనను టీమ్ఇండియా ఘనంగా ప్రారంభించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ్టి నుంచి ఐదు టీ20ల ..

Updated : 29 Jul 2022 11:26 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌ పర్యటనను టీమ్ఇండియా ఘనంగా ప్రారంభించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ్టి నుంచి ఐదు టీ20ల సమరానికి సిద్ధమైంది. వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న భారత సారథి రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌ పగ్గాలను అందుకోనున్నాడు. ఈ క్రమంలో మీడియాతో రోహిత్ కీలకాంశాలపై మాట్లాడాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ ముందు వరకు టీమ్‌ఇండియా సంప్రదాయ పద్ధతిలో క్రికెట్‌ ఆడిందని, అందుకే ఓటమిపాలైందనే విమర్శలను అంగీకరించనని రోహిత్ వెల్లడించాడు. 

‘‘గత ప్రపంచకప్‌లో సరైన ఫలితాలను సాధించలేకపోయాం. అలాగని మేము సరిగ్గా ఆడలేదని కాదు. అదేవిధంగా సంప్రదాయబద్ధంగా ఆడటం వల్లే ఓటమిపాలైందని బయట వచ్చిన విమర్శలను అంగీకరించను. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడితే చాలు ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవు. పైన చెప్పినట్లు అనుకుందాం... మేం గత ప్రపంచకప్‌ ముందు వరకు ఆడిన మ్యాచుల్లో దాదాపు 80 శాతం గెలిచాం. ఈ విధంగా మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్‌ సంప్రదాయపద్ధతిలోనే ఆడిందని ఎలా చెబుతున్నారో అర్థం కావడంలేదు. మేం ప్రపంచకప్‌లో ఓడిపోయాం. అది జరిగిపోయింది. అలాగని మా జట్టు సభ్యులు స్వేచ్ఛగా ఆడలేదని కాదు. ఇటీవల టీమ్‌నంతా ఏదో పూర్తిగా మార్చినట్లు చెబుతున్నారు. కానీ మా ఆటగాళ్లకు మరింత స్వేచ్ఛ ఇచ్చాం. అందుకే అద్భుత ప్రదర్శన బయటికొస్తోంది. అయితే బయటి వ్యక్తులు (విమర్శకులు) కాస్త సంయమనం పాటించాలి. మేం ఆడే విధానంతో కొన్నిసార్లు పరాజయాలు వస్తాయి. అనుకున్న విధంగా ఫలితాలు ఉండకపోవచ్చు. అయితే ఎప్పుడూ విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయేమో కానీ.. ఆటగాళ్లు సరిగా ఆడనట్లు కాదు. ప్రతి ఒక్కరూ ఏదొక సమయంలో మారాలి. ఇప్పుడు మేం మారుతూ వస్తున్నాం. విమర్శలు చేసేవారు కూడా మారాల్సిన అవసరం ఉంది’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. 

ప్రపంచకప్‌ కోసం బరిలోకి దిగే జట్టులో స్థానాలను పూరించాల్సిన అవసరం ఉందా...? ఎలా చేస్తారనే ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇచ్చాడు. ‘‘ప్రపంచకప్‌ టీమ్‌లో కొన్ని స్థానాలను ఆటగాళ్లతో పూరించాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి ప్లేయర్లు ఎవరనేది మాకు తెలుసు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం రాబోయే ప్రతి మ్యాచ్‌ను వినియోగించుకుంటాం. మా యువ ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇస్తున్నాం. ఇప్పటికే సన్నద్ధత, టెక్నిక్‌కు సంబంధించిన విషయాలను వారికి వివరించాం. మ్యాచ్‌లో మాత్రం వారు ఎలా ఆడాలని భావిస్తున్నారో అదే విధంగా ఆడాలని సూచించాం. ఆటగాళ్లలో ఉన్న ఒత్తిడిని  తరిమేయడమే మా బాధ్యత. స్వేచ్ఛగా ఆడేందుకు అవసరమైన పరిస్థితులను వారికి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. అలానే ప్రతి ఒక్కరూ ప్రపంచకప్‌ నాటికి తాజాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన వారికి విశ్రాంతినిస్తున్నాం. అయితే వరల్డ్‌కప్‌ సమయానికి సిద్ధంగా ఉంచేలా చూస్తున్నాం. విండీస్‌తో సిరీస్‌లు ఆడని వారికి వచ్చే మ్యాచుల్లో అవకాశం కల్పిస్తాం. మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన కోచ్‌ ప్యాడీ ఆప్టన్‌. ఆయన ఉండటం జట్టుకు, ఆటగాళ్లకు ఎంతో ప్రయోజనం’’ అని రోహిత్ పేర్కొన్నాడు. విండీస్‌ పర్యటన అనంతరం జింబాబ్వేతో భారత్‌ మూడు వన్డేలను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్‌ కోసం బరిలోకి దిగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని