Rohit Sharma: ఆసీస్‌ ప్లాన్‌ మార్చింది.. నేను గేర్‌ మార్చా: రోహిత్ శర్మ

ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గాలి ప్రభావం ఎక్కువగా ఉందని.. దానికి అనుగుణంగా ఆటతీరులో మార్పు చేసుకోవాల్సి వచ్చిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

Updated : 25 Jun 2024 08:10 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) ఆసీస్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుకుంది. సూపర్-8 పోరులో  కెప్టెన్ రోహిత్ శర్మ (92) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. స్టార్ పేసర్లను అడ్డుకొని భారీగా పరుగులు రాబట్టాడు. సెయింట్ లూసియా మైదానంలో ‘గాలి’ ప్రభావం తీవ్రంగా ఉందని.. అందుకోసం బలంగా షాట్లను కొట్టాల్సి వచ్చిందని రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యానించాడు. కోహ్లీ (0) డకౌట్‌ అయినా ఆ ప్రభావం ఎక్కడా పడకుండా.. స్టార్క్‌ బౌలింగ్‌లో రోహిత్ విజృంభించాడు. ఆసీస్‌ బౌలర్లు ‘గాలి’ని అడ్వాంటేజ్‌గా తీసుకొనేందుకు ప్రయత్నించారని.. దాంతో తన బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని వివరించాడు.

‘‘ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తొలి ఓవర్‌ నుంచే గాలి ప్రభావం ఎక్కువగా ఉందని అర్థమైంది. ఆసీస్‌ బౌలర్లు (IND vs AUS) అందుకు తగ్గట్టుగా బౌలింగ్‌లో ప్రణాళికలు మార్చుకున్నారు. గాలికి వ్యతిరేకంగా బంతులేయడం చేశారు. అందుకే, నేను కూడా ఆఫ్‌సైడ్‌ భారీ షాట్లు కొట్టాలని తీవ్రంగా ప్రయత్నించా. కేవలం ఒక్క వైపు ఆడాలని అనుకోవడం కూడా తప్పే. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఫీల్డింగ్‌ సెటప్‌ను బట్టి షాట్ల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మేం నిర్దేశించిన 200+ లక్ష్యం భారీ స్కోరే. ఇక్కడ గాలి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైనా జరగొచ్చు. మా బౌలర్లు పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు. కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాం. 

కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) బలాలేంటో మాకు తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు అతడి వైపే చూస్తాం. న్యూయార్క్‌ పిచ్‌లు పేసర్లకు సహకారం అందించాయి. ఇప్పుడు విండీస్‌లో జరుగుతున్న మ్యాచుల్లో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువ. తప్పకుండా అతడు కీలక పాత్ర పోషిస్తాడని భావించాం. కుల్‌దీప్‌ కూడా ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. ఇక్కడ బ్యాటింగ్‌ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. గతంలో చెప్పినట్లు ఫిఫ్టీలు, సెంచరీలు ఇక్కడ విషయమే కాదు. జట్టుకు అవసరమైన పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టా. భారీ స్కోర్లు చేయాలంటే దూకుడు ప్రదర్శించాలి. బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తేనే అది సాధ్యపడుతుంది’’ అని రోహిత్ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని