Rohit Sharma: ప్రతి కెప్టెన్‌ ఛాంపియన్‌షిప్స్‌ గెలవాలనుకుంటాడు.. నేనూ అందుకు భిన్నం కాదు: రోహిత్ శర్మ

ప్రతి కెప్టెన్‌ ఛాంపియన్‌షిప్‌లను గెలవాలనుకుంటాడని, నేను కూడా అందుకు భిన్నమేమికాదని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేర్కొన్నాడు. 

Published : 07 Jun 2023 01:27 IST

లండన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ప్రారంభంకానున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia)తో భారత్ (Team India) తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ప్రతి కెప్టెన్‌ ఛాంపియన్‌షిప్‌లను గెలవాలనుకుంటాడని, తాను కూడా అందుకు భిన్నమేమికాదని పేర్కొన్నాడు.  ‘‘ప్రతి ఒక్కరూ జట్టును ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. అందరూ టైటిల్ గెలవాలని కోరుకుంటారు. ప్రతి కెప్టెన్ ఛాంపియన్‌షిప్‌లు సాధించాలనుకుంటాడు. నేనూ అందుకు భిన్నమేమి కాదు. రాబోయే ఐదు రోజులు మాకు చాలా ముఖ్యమైనవి. మా మనస్సులో ఉన్నదానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను’’ అని రోహిత్ అన్నాడు.  

‘‘మా జట్టు బాగుంది. అందుకు చాలా సంతోషిస్తున్నాం. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఏం జరిగిందో మాకు తెలుసు. మేం ఇంతకు ముందు ఇక్కడ (ఇంగ్లాండ్‌)లో ఆడాం. ఏళ్ల తరబడిగా ఇలాగే క్రికెట్ ఆడుతున్నాం. అందుకే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అందరూ తాజాగా ఉండేలా చూసుకోవడానికి ఆటగాళ్లు ముఖ్యమైన మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. గతేడాది కూడా మేం ఐపీఎల్‌ ఆడిన తర్వాత యూకేకు వచ్చి ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాం. జట్టుగా మేం ఏం సాధించామో, చివరిసారి ఎప్పుడు గెలిచామో మాకు తెలుసు. దాని గురించి ఆలోచించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేం ఆటపై దృష్టిపెట్టాలనుకుంటున్నాం. మా జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఈ పరిస్థితుల్లో ఆడిన అనుభవముంది. నేను పిచ్‌ని పరిశీలించాను. పిచ్‌ పేసర్లకు సహకరించేలా ఉంది. ఇంగ్లాండ్‌లో వాతావరణం రోజురోజుకూ మారుతుంది. అశ్విన్‌ తుది జట్టులో ఉండడని నేను చెప్పట్లేదు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’’ అని రోహిత్‌ శర్మ వివరించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని