Rohit - IPL: ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌ శర్మ

ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ ముంగిట ఐపీఎల్‌ జరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదేనని భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ తెలిపాడు.

Published : 23 Mar 2023 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ (IPL 2023)  వల్ల ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదేనని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తెలిపాడు. ఈ ఏడాది చివర్లో  వన్డే ప్రపంచకప్‌ (World Cup) జరగనుంది.  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (World Test Championship) ఫైనల్‌ సైతం ఐపీఎల్‌ అనంతరం జరుగుతుంది.  ఈ రెండు కీలక టోర్నమెంట్ల దృష్ట్యా ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలంటే ఒత్తిడి ఉండకూడదు. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్‌ వల్ల ఆటగాళ్లు పనిభారంతో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీమ్‌ఇండియాకు కీలకమైన ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే జస్ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. ప్రపంచకప్‌, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గాయాల కారణంగా బుమ్రా, శ్రేయస్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడలేదు. డిసెంబర్‌ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. వన్డేల్లో నిలకడగా పరుగులు సాధించే శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను సర్జరీ కారణంగా ఐదు నెలల పాటు అందుబాటులో ఉండడని సమాచారం.  ఐపీఎల్‌ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా గాయాలపాలైతే టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లో రాణించడం కష్టమవుతుంది.  కాబట్టి ఆటగాళ్ల పనిభారంపై దృష్టి పెట్టడం ఐపీఎల్‌ ఫ్రాంచైజీల బాధ్యతేనని రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు.  ఆటగాళ్లు ఫిట్‌గా ఉండేలా టీమ్‌ఇండియా యాజమాన్యం ఇప్పటికే సూచనలు చేసిందని తెలిపాడు.

‘‘ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదే. ఎందుకంటే వారే ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. మేం అన్ని జట్లకు సూచనలిచ్చాం. ప్రపంచకప్‌ వరకు ఫిట్‌గా ఉండాల్సిన బాధ్యత ఆటగాళ్లదే’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశం ఆటగాళ్లకు ఉంటుంది. కానీ అది కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ‘‘విశ్రాంతి తీసుకోవాలని ఆటగాళ్లు భావిస్తే తమ జట్టు యాజమాన్యాలతో, ఫ్రాంచైజీలతో చర్చించి ఒకటి రెండు మ్యాచులకు విరామం తీసుకోవచ్చు. కానీ వారు అనుమతిస్తారా లేదా అనేది అనుమానమే’’ అని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు.

మార్చి 31 నుంచి ఐపీఎల్‌ ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌ గుజరాత్, చెన్నై జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరుగుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ జూన్‌ 7 నుంచి ప్రారంభంకానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని