IND vs AUS: టెస్టు క్రికెట్ కష్టతరమైనది.. ఈ ఫార్మాట్‌లో ఆడటం అంత సులభం కాదు: రోహిత్‌

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ముగిసిన అనంతరం టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. ఈ సిరీస్‌లో అనుకున్న ఫలితం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

Updated : 14 Mar 2023 00:59 IST

అహ్మదాబాద్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమ్‌ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ డ్రా కాకముందే శ్రీలంకపై న్యూజిలాండ్‌ విజయం సాధించడంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)కు దూసుకెళ్లింది. నాలుగో టెస్టులో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా, సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన అశ్విన్‌, రవీంద్ర జడేజా ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ అవార్డును అందుకున్నారు. నాలుగో టెస్టు ముగిసిన అనంతరం భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మాట్లాడారు.

‘‘ఇది అద్భుతమైన సిరీస్. చాలా మంది ఆటగాళ్లు ఈ సిరీస్‌లో మొదటిసారి ఆడారు. ఈ సిరీస్ మాకు, ఆస్ట్రేలియాకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాం. సిరీస్‌ గెలవడం కోసం మా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు అమలు చేసి  ముందుకు సాగాం. సిరీస్‌ ఆరంభం ఎంత ముఖ్యమో మాకు తెలుసు. దిల్లీ టెస్టులో విజయం సాధించడం పట్ల చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో మేం తొలుత వెనుకబడ్డాం. అనంతరం గొప్పగా పోరాడి మ్యాచ్‌ని చేజిక్కించుకున్నాం. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో మేం ఒత్తిడికి గురై ఓడిపోయాం. తర్వాత మా ఆటగాళ్లు బాధ్యత తీసుకోని ఆడటంతో సిరీస్‌ను నిలబెట్టుకున్నాం. టెస్ట్ క్రికెట్ కష్టతరమైనది. ఈ ఫార్మాట్‌లో ఆడటం అంత సులభం కాదు. సిరీస్‌ ఫలితం పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నా కోసం నేను ఎలాంటి బెంచ్‌మార్క్ సెట్ చేసుకున్నానో నాకు తెలుసు. నేను వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టాను. సిరీస్ నుంచి నేను కోరుకున్న ఫలితాన్ని మేం పొందాం. సిరీస్‌ని కైవసం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని రోహిత్‌ శర్మ అన్నాడు.

ఒక్క సెషన్‌లో చేసిన తప్పులతో ఓడిపోయాం: స్మిత్‌

‘భారత్‌ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చింది.  మా ఆటగాళ్లు  చాలా సరదాగా గడిపారు. అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సిరీస్ ప్రారంభంలో మేం కాస్త వెనుకబడ్డాం. తర్వాత పుంజుకున్నాం. దిల్లీ టెస్టులో ఒక్క సెషన్‌లో మేం చేసిన తప్పులు మ్యాచ్‌ని మాకు దూరం చేశాయి. సిరీస్‌లో మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. టాడ్‌ మర్ఫీ, కునెమన్‌ చాలా చక్కగా, ప్రశాంతతతో బౌలింగ్ చేశారు. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నాథన్‌ లైయన్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు’ అని స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు.

ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ కోహ్లీ ఏమన్నాడంటే?

‘నిజం చెప్పాలంటే.. ఒక ఆటగాడిగా నా నుంచి నేను ఏం ఆశిస్తున్న అనేది నాకు ముఖ్యం. నాగ్‌పూర్‌ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నేను బాగా బ్యాటింగ్ చేస్తున్నానని భావించాను. చాలా సేపు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాం. కొంత మేరకు నేను సఫలమయ్యా. కానీ, గతంలో ఆడినట్లు ఆడలేదు. దాంతో కాస్త నిరాశ చెందారు. నేను కోరుకున్న విధంగా ఆడటం మాత్రం నాకు ఉపశమనాన్ని ఇచ్చింది.  నా డిఫెన్స్‌ ఆటతీరు పట్ల సంతోషంగా ఉన్నా. నేను 60 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు సానుకూలంగా ఆడాలని నిర్ణయించుకున్నాం. కానీ, గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్‌ ఆడకపోవడంతో ఒక బ్యాటర్‌ సేవలను కోల్పోయాం. దాంతో ఎక్కువ సమయం ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆస్ట్రేలియా బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు. ఫీల్డింగ్‌ కూడా సరిగ్గా చేశారు’ అని విరాట్‌ కోహ్లీ అన్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు