IPL Mega Auction: ఐపీఎల్‌ వేలంపాట ఫీవర్‌.. ఆసక్తికర ఫొటోను పంచుకున్న రోహిత్‌ శర్మ

ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ కోసం వేలం జోరుగా సాగుతోంది. కొందరు ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ మొత్తంలో అమ్ముడయ్యారు......

Published : 12 Feb 2022 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ కోసం వేలం జోరుగా సాగుతోంది. కొందరు ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ మొత్తంలో అమ్ముడయ్యారు. శనివారంతోపాటు ఆదివారం కూడా ఈ వేలంపాట కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా సారథి ఓ ఆసక్తిరక ఫొటోను పంచుకున్నాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంపాటను టీవీలో ఆసక్తిగా తిలకిస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘కొందరు ముఖాల్లో టెన్షన్‌, మరికొందరి మోముల్లో చిరునవ్వు’ అంటూ పేర్కొన్నాడు. రోహిత్‌ పంచుకున్న ఫొటోలో యజువేంద్ర చహల్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రిషభ్‌ పంత్‌తోపాటు సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి జోరుమీదున్న టీమ్‌ఇండియా.. టీ20 సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది. ఈడెన్‌ గార్డెన్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం జట్టు కోల్‌కతాకు చేరుకుంది.

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్‌ వేలంపాట చర్చలే. యువ ఆటగాళ్లపై నమ్మకముంచిన ఫ్రాంచైజీలు వారిపై భారీగా వెచ్చిస్తున్నాయి. యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు ఏకంగా రూ. 15.25 కోట్ల ధర పలికింది. పాత జట్టు ముంబయి ఇండియన్స్‌ కిషన్‌ను మళ్లీ దక్కించుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. యువ బౌలర్లపై కనకవర్షం కురిసింది. దీపక్‌ చాహర్‌ భారీ ధర పలికాడు. చెన్నై జట్టు అతడిని రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్‌ ఠాకూర్‌ను రూ. 10.75 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. గతేడాది అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్న హర్షల్‌ పటేల్‌ సహా ప్రసిద్ధ్‌ కృష్ణ, లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌పైనా ఫ్రాంచైజీలు భారీగానే వెచ్చించాయి. అయితే సురేశ్‌ రైనాతోపాటు మరికొందరు సీనియర్‌ ఆటగాళ్లకు మొండిచేయి మిగిలింది. వారిని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని