Updated : 24 Feb 2022 22:58 IST

IND vs SL: విరాట్ కోహ్లీని అధిగమించిన రోహిత్‌ శర్మ.. రికార్డిదే!

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకున్నాడు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్ గప్తిల్‌ను అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. లఖ్‌నవూలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 37 పరుగుల వ్యక్తిగత స్కోరును చేరుకోవడంతో రోహిత్.. గప్తిల్ (3,299) పరుగులను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 44 పరుగుల వద్ద రోహిత్‌ ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్‌ (3,307) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. గప్తిల్ (3,299) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ (3,296) పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు (4) సాధించిన రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. రెండు సెంచరీలతో గప్తిల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో ఒక్క శతకం కూడా చేయలేకపోయాడు. అయితే, ఈ ఫార్మాట్‌ల్లో అత్యధిక అర్ధసెంచరీలు (30) బాదిన ఆటగాడిగా నిలిచాడు. 


 బుమ్రాను అధిగమించిన చాహల్‌..

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ మరో రికార్డు సాధించాడు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు (67) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (66 వికెట్లు) రికార్డును బద్దలైంది. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (61), భువనేశ్వర్‌ కుమార్ (57), రవీంద్ర జడేజా (47) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌ (117) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts