Rohit Sharma: టీ20ల్లో రోహిత్ అరుదైన ఘనత.. గప్తిల్‌ను అధిగమించిన హిట్‌మ్యాన్‌

కీలకమైన పోరులో రోహిత్ శర్మ వీరవిహారంతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో ఆసీస్‌తో మూడు టీ20ల...

Updated : 24 Sep 2022 14:17 IST

ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన పోరులో రోహిత్ శర్మ (46 నాటౌట్‌: 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరవిహారంతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసి రేసులో నిలబడింది. ఆఖరి మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా ఆదివారం జరగనుంది. వర్షం కారణంగా నాగ్‌పుర్‌లోని మైదానం చిత్తడిగా మారడంతో పూర్తిస్థాయి మ్యాచ్‌ జరగలేదు. మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లకు కుదించగా..  ఆసీస్‌ 90/5 స్కోరు చేసింది. అనంతరం రోహిత్ ధాటిగా ఆడటంతో 7.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న రోహిత్ శర్మ (3,677 పరుగులు) తాజాగా.. కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ పేరిట ఉన్న అత్యధిక సిక్స్‌ల రికార్డునూ అధిగమించాడు. 

ఆసీస్‌తో రెండో టీ20 ముందు వరకు రోహిత్ శర్మ, మార్టిన్‌ గప్తిల్‌ చెరో 172 సిక్స్‌లతో ఉండేవారు. అయితే ఆసీస్‌ మీద నాలుగు సిక్స్‌లు కొట్టిన రోహిత్.. మొత్తం 176 సిక్స్‌లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. వీరిద్దరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్ (124), ఇయాన్‌ మోర్గాన్ (120), ఆరోన్ ఫించ్‌ (119) ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ టీ20 కెరీర్‌లో 3,677 పరుగులు చేయగా.. అందులో కేవలం సిక్స్‌లతోనే 1,056 పరుగులు రావడం గమనార్హం. అంటే దాదాపు 28.71 శాతం పరుగులను స్టాండ్స్‌లోకి బంతికి పంపించడంతోనే సాధించాడు. ఇక అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లలో ఐర్లాండ్ ఆటగాడు స్టిర్లింగ్‌ (344) తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (328) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఆ సిక్స్‌ నాకే ఆశ్చర్యమేసింది: రోహిత్

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లను కెప్టెన్‌ రోహిత్ శర్మ కొనియాడాడు. ముఖ్యంగా అక్షర్‌ పటేల్ సూపర్‌ స్పెల్‌తో ఆకట్టుకొన్నాడని, అతడి బ్యాటింగ్‌లోనూ రాణిస్తే చూడాలని ఉందని రోహిత్ పేర్కొన్నాడు. కీలకమైన సమయంలో మ్యాక్స్‌వెల్‌, టిమ్‌ డేవిడ్‌ వంటి హిట్టర్లను ఔట్‌ చేసి తన రెండు ఓవర్ల కోటాలో 13 పరుగులను మాత్రమే ఇచ్చాడు. అలాగే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో 90 మీటర్ల సిక్స్‌ కొట్టిన రోహిత్ దానిపైనా స్పందించాడు. ‘‘ఆ సిక్స్‌ కొట్టిన వెంటనే నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యా. అలా వెళ్తుందని అంచనా వేయలేదు. గత ఎనిమిది నెలలుగా ఇలాగే ఆడుతున్నా.  అయితే ఇలాంటి తక్కువ నిడివితో కూడిన మ్యాచుల్లో అతిగా ప్రణాళికలు వేసుకొని బరిలోకి దిగలేం’’ అని రోహిత్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని