Rohit Sharma: టీమ్‌ఇండియాకు షాక్‌.. రోహిత్‌ శర్మకు కరోనా

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో...

Updated : 26 Jun 2022 07:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో అతడికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం తెల్లవారుజామున ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం అతడు టీమ్‌ బస చేసిన హోటల్‌లోనే ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. అయితే, జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఆడే కీలక టెస్టుకు ముందు ఇలా జరగడం టీమ్‌ఇండియాకు పెద్ద షాకనే చెప్పాలి. మరోవైపు రోహిత్‌ ప్రస్తుతం లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో గురువారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 25 పరుగులు చేశాడు. కానీ, శనివారం రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు రాలేదు.

ఈ క్రమంలోనే రోహిత్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఇరు జట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కాగా, గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాక.. కరోనా కేసుల కారణంగానే ఐదో మ్యాచ్‌ వాయిదా పడింది. అప్పుడు కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు పలువురు భారత ఆటగాళ్లు కొవిడ్‌-19 బారిన పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే, రోహిత్‌ ఈ టెస్టుకు ముందు కోలుకుంటే కెప్టెన్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. లేకపోతే రిషభ్‌ పంత్‌ లేదా జస్ప్రిత్‌ బుమ్రా కెప్టెన్సీ చేసే వీలుంది. ఈ నేపథ్యంలో రోహిత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని