IND vs USA: అమెరికాతో మ్యాచ్‌.. తుది జట్టులో వారిద్దర్నీ కొనసాగిస్తారా..?

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా గ్రూప్‌ Aలో అమెరికాతో మ్యాచ్‌కు సిద్ధమైంది.

Published : 12 Jun 2024 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆతిథ్య జట్టు అమెరికాపై నేడు విజయం సాధిస్తే రోహిత్‌ సేన సూపర్‌ 8లోకి సగర్వంగా అడుగుపెట్టనుంది. అయితే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుని విజయం నమోదు చేసినప్పటికీ.. టీమ్‌ఇండియా(Team India) బ్యాటింగ్‌ ఆర్డర్‌ కలవరపెడుతోంది.

నేడు అమెరికాతో మ్యాచ్‌ నేపథ్యంలో సారథి రోహిత్‌(Rohit Sharma).. జట్టులో రెండు మార్పులతో ముందుకురానున్నట్లు తెలుస్తోంది. పాక్‌పై పెద్దగా ఆకట్టుకోని శివమ్‌ దూబే, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవచ్చని సమాచారం. ముఖ్యంగా దూబే ప్రదర్శనపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఐపీఎల్‌లో సిక్స్‌లతో విరుచుకుపడిన దూబే.. మెగా టోర్నీలో మాత్రం డ్రాప్‌ఇన్‌ పిచ్‌లపై ఇబ్బందిపడుతున్నాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో పరుగులేమీ చేయలేదు. దాయాది పాక్‌పై కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి 9 బంతులాడి కేవలం 3 పరుగులే చేశాడు.

ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో దూబే సేవలను ధోనీ వినియోగించుకున్నాడు. మరి మెగా టోర్నీలో అలాంటి అవకాశం లేని నేపథ్యంలో రోహిత్‌ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. దూబేను ప్లేయింగ్‌ XI నుంచి తప్పిస్తే.. సంజూ శాంసన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పాక్‌తో మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో వికెట్‌ తీయలేదు. అమెరికాతో మ్యాచ్‌లో అతడిని కొనసాగిస్తారా.. చూడాల్సి ఉంది. ఇక తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన మణికట్టు స్పిన్నర్లు చాహల్‌, కుల్‌దీప్‌ సేవలను.. స్పిన్‌కు అనుకూలించే కరీబియన్‌ పిచ్‌లపై ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌ గెలిస్తే టీమ్‌ఇండియా సూపర్‌ 8కు చేరుకుంటుంది. మరి కీలకమైన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ప్రయోగాలకు వెళ్తాడా..? లేక కెనడాతో జరిగే చివరి మ్యాచ్‌లో ఈ ఆప్షన్లు పరిశీలిస్తాడా తెలియాల్సి ఉంది. మరోవైపు మెగా టోర్నీలో పసికూనగా అడుగుపెట్టిన అమెరికా అనూహ్య విజయాలతో దూసుకెళ్తోంది. పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చి సూపర్‌ 8 రేసులో నిలిచింది. ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని