Cricket News: సచిన్‌ రికార్డుపై రోహిత్-విరాట్ గురి.. ఆ ముగ్గురితో చర్చిస్తూనే ఉన్నానంటున్న సూర్య!

టోర్నీల సందడి మళ్లీ మొదలు కానుంది. తొలుత ఆసియా కప్ (Asia Cup 2023).. ఆపైన మెగా టోర్నీ వన్డే ప్రపంచకప్‌లో అలరించేందుకు క్రికెట్ జట్లు సిద్ధమవుతున్నాయి.

Updated : 29 Aug 2023 13:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బుధవారం నుంచి ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓ రికార్డుపై కన్నేశారు. ఇప్పటి వరకు ఆ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin) పేరిట ఉంది. భారత బ్యాటర్‌గా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్‌ కొనసాగుతున్నాడు. ఆసియా కప్‌లో (వన్డే ఫార్మాట్‌) 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ 23 మ్యాచుల్లో 971 పరుగులు సాధించాడు. భారత క్రికెటర్లలో సచిన్‌ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) 22 మ్యాచుల్లో 745 పరుగులు, ధోనీ 19 మ్యాచుల్లో 648 పరుగులు, విరాట్ కోహ్లీ 11 మ్యాచుల్లోనే 613 పరుగులతో కొనసాగుతున్నారు. తక్కువ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఇక ఈ టోర్నీలో భారత్‌ కనీసం ఐదు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. కాబట్టి, రోహిత్ మరో 226 పరుగులు, విరాట్ 358 పరుగులు సాధిస్తే సచిన్‌ను అధిగమించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో అత్యధికంగా పరుగులు చేసిన బ్యాటర్‌ మాత్రం జయసూర్య (1220 రన్స్‌) కావడం విశేషం. 


అలా ఆడలేకపోతున్నా..: సూర్య

భారత ‘మిస్టర్ 360’ ఆటగాడు సూర్యకుమార్‌ టీ20ల్లో అదరగొట్టేస్తున్నాడు. కానీ, వన్డేల్లో మాత్రం తన స్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. తన ఫామ్‌పై ఎప్పటికప్పుడు ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్య, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో మాట్లాడుతూనే ఉన్నట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ‘‘జట్టు నాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటా. ఈ ఫార్మాట్‌లో రాణించడంపై దృష్టి పెట్టా. టీ20ల్లో గొప్పగా ఆడుతున్నా.. కానీ వన్డేల్లో ఇదే ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నా. ఎందుకు ఇలా జరుగుతుందని అభిమానులూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, నేను ఫామ్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నా. వన్డే ఫార్మాట్‌ చాలా సవాల్‌తో కూడుకున్నదే. ఇందులో అన్నింటిని కలిపి ఆడాల్సిన అవసరం ఉంది. తొలుత క్రీజ్‌లో కుదురుకోవాలి. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత టీ20ల్లో మాదిరిగా భారీ షాట్లు ఆడాలి. ఇదే విషయంపై రాహుల్, రోహిత్, విరాట్‌తో చర్చిస్తూనే ఉన్నా. అయితే, నేను ప్రాక్టీస్‌ చేసిన విధంగా మ్యాచ్‌లో పరిస్థితికి అనుగుణంగా ఆడలేకపోతున్నా. ఈసారి తప్పకుండా రాణిస్తాననే నమ్మకం ఉంది’’ అని సూర్య వివరించాడు. 


‘చక్‌ దే ఇండియా’ స్ఫూర్తిగా సభ్యులకు బాబర్ ఉపదేశం!

శ్రీలంకతో కలిసి పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తోన్న ఆసియా కప్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నేపాల్‌తో పాక్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. మినీ టోర్నీకి సన్నద్ధమవుతున్న పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ తన సహచరుల్లో స్ఫూర్తి నింపేందుకు ‘చక్‌ దే ఇండియా’  సినిమాలో మాదిరిగా ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘మనం ఇప్పుడు వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా ఉన్నాం. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన హృదయంతో ఉన్నారు. ‘అతడు చేస్తాడు. నేను ఎందుకు చేయాలి?’ అని ఎవరూ అనుకోరు. ప్రతి ఒక్కరూ జట్టు విజయం కోసం అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు సంతోషంగా సిద్ధపడాలి. అంతేకానీ, బ్యాటింగ్‌ గెలిపించాలి.. లేదా బౌలింగ్‌ గెలిపించాలి అని మాత్రం అనుకోవడానికి లేదు. ఇక్కడెవరూ ‘నేను’ అనే భావనతో ఉండకూడదు. ‘మనం’ అని మాత్రమే ముందుకు సాగాలి’’ అని బాబర్ వ్యాఖ్యానించాడు.


బ్యాటర్‌గానే బెన్‌స్టోక్స్‌ సన్నద్ధత

వన్టే ప్రపంచకప్‌ కోసం 50 ఓవర్ల ఫార్మాట్‌లోకి తిరిగొచ్చిన ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్‌ కేవలం బ్యాటర్‌గానే తన సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాషెస్ సిరీస్‌లోనూ బెన్‌ స్టోక్స్‌ పెద్దగా బౌలింగ్‌ చేయలేదు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లోనూ బెన్‌స్టోక్స్ బరిలోకి దిగుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న తమ జట్టు మళ్లీ విజేతగా నిలవడమే లక్ష్యమని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు చీఫ్‌ సెలెక్టర్ లూక్ రైట్ వ్యాఖ్యానించాడు. అందుకోసం బెన్‌స్టోక్స్‌ సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో బెన్‌ కీలక పాత్ర పోషిస్తాడని నమ్ముతున్నట్లు లూక్‌ తెలిపాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని