
Rohit Sharma: మనసులో మాట బయటపెట్టిన రోహిత్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఎవరికోసం ఎదురు చూస్తున్నాడో చెప్పాడు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘ఫ్రెండ్స్:ది రీయూనియన్’ అనే సిరీస్ ఇటీవల భారత్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అందులో పలువురు స్నేహితులు చాలా కాలం తర్వాత తిరిగి కలుసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇది యువతను ఆకట్టుకునే కథనం కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే రోహిత్ కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్ చేస్తూ.. తాను ఎవరిని కలుసుకోవాలని అనుకుంటున్నాడో చెప్పాడు.
‘F.R.I.E.N.D.S.. నేను వేచి చూసేది మీకోసమే’ అని వ్యాఖ్యానిస్తూ రోహిత్ 2019 వన్డే ప్రపంచకప్ నాటి ఓ ఫొటోను ట్వీట్ చేశాడు. ఆ మెగా టోర్నీలో హిట్‌మ్యాన్ 9 మ్యాచుల్లో 81 సగటుతో 648 పరుగులు చేయడమే కాకుండా రికార్డు స్థాయిలో 5 శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. అందులో ఒక సెంచరీ చేశాక అభిమానులను చూస్తూ హిట్‌మ్యాన్ బ్యాట్ పైకెత్తిన ఫొటోను పంచుకున్నాడు. దానర్థం అతడు మళ్లీ మైదానంలో అభిమానులను చూడాలనుకుంటున్నాడు. ప్రేక్షకుల సందడి కావాలని ఇష్టపడుతున్నాడు. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించని సంగతి తెలిసిందే.
అందువల్ల అన్ని జట్ల ఆటగాళ్లు అభిమానుల సందడి, మద్దతును కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఐపీఎల్‌తో పాటు పలు అంతర్జాతీయ సిరీస్‌లు సైతం ఎవరూ లేకుండానే నిర్వహించారు. కొద్ది కాలంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు సగం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నాయి. ఇక జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 4 వేల మందిని అనుమతిస్తామని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఇటీవల వెల్లడించింది. అదే నిజమైతే కాస్తయినా రోహిత్ కోరిక నెరవేరినట్లే.