Rohit Sharma: రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్‌

అంతర్జాతీయ టీ20లకు రోహిత్‌ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్‌ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

Updated : 01 Jul 2024 10:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘ నిరీక్షణ ఫలించి టీమ్‌ఇండియా (Team India) విశ్వవిజేతగా అవతరించడంతో యావత్‌ భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి. మన జట్టు టీ20 ప్రపంచకప్‌ (T20 World cup 2024) అందుకున్న ఉద్విగ్న క్షణాల్లో మైదానంలో ఆటగాళ్లతో పాటు కోట్లాది కళ్లు చెమర్చాయి. ఈ విజయంతోనే దిగ్గజ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడం మరింత భావోద్వేగానికి గురిచేసింది. ఈసందర్భంగా వారి సతీమణులు తమ రియల్ లైఫ్‌ హీరోలకు ప్రత్యేకంగా విష్‌ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

సులువుగా తీసుకోలేకపోతున్నా: రితిక

ప్రపంచకప్‌ను అపురూపంగా చూసుకుంటున్న రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఫొటోను షేర్‌ చేసిన అతడి సతీమణి రితికా సజ్దే భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. ‘‘రో.. ఈ విజయం నీకు ఎంత విలువైందో నాకు తెలుసు. ఈ ఫార్మాట్‌, ఈ కప్పు, ఈ ఆటగాళ్లు.. ఈ ప్రయాణం.. ఇదంతా నువ్వు కన్న కల. గత కొన్ని నెలలు నువ్వు చాలా కఠిన సమయాన్ని గడిపావు. అది నీ మనసు, శరీరంపై ఎంత ప్రభావం చూపిందో నాకు తెలుసు. కానీ వాటన్నింటినీ అధిగమించి నువ్వు నీ కలను నెరవేర్చుకోవడం చాలా స్ఫూర్తి కలిగిస్తోంది. ఓ భార్యగా ఇందుకు నేను చాలా గర్వపడుతున్నా. కానీ, నీ ఆటను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఇప్పుడు టీ20లకు వీడ్కోలు పలకడం బాధగా ఉంది. ఇది నీకు కఠిన నిర్ణయమైనా జట్టుకు ఏది ఉత్తమమైందో దానిగురించే నువ్వు సుదీర్ఘంగా ఆలోచిస్తావు. కానీ దీన్ని నేను సులువుగా తీసుకోలేకపోతున్నా. ఇంతటి గొప్ప వ్యక్తి నా సొంతం అయినందుకు నేను చాలా గర్విస్తున్నా. ఐ లవ్‌ వ్యూ సో మచ్‌’’ అని రితిక (Ritika Sajdeh) రాసుకొచ్చారు.


అనుష్క ఈ విజయం నీదే: కోహ్లీ

టీమ్‌ఇండియా విజయం తర్వాత కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ఈ వ్యక్తిని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు నా సొంతమైనందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక ఓ గ్లాస్‌ చల్లని నీళ్లతో ఈ విజయాన్ని ఆస్వాదించు’’ అని ఆమె రాసుకొచ్చారు. దీనికి కోహ్లీ బదులిస్తూ సతీమణిపై తన ప్రేమను చాటుకున్నాడు. ‘‘నువ్వు లేకుండా ఇదేదీ సాధ్యమయ్యేది కాదు. నువ్వు నన్నెప్పుడూ అభినందిస్తావు.. నిస్సంకోచంగా ఉండేలా చూస్తావు. నాకు సంబంధించి ప్రతీది నిజాయతీగా తెలియజేస్తావు. నీకు నేనెప్పటికీ రుణపడి ఉంటా. ఈ విజయం నాది ఎంతో.. నీదీ అంతే..! థ్యాంక్యూ అనుష్క’’ అని విరాట్‌ (Virat Kohli) ఎమోషనల్‌ అయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు