Rohit Sharma: ఛాంపియన్స్‌ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ రోహిత్‌కే సారథ్యం: జైషా

సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్‌ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్‌మ్యాన్‌ ముంగిట ఉన్నాయి.

Updated : 07 Jul 2024 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్‌ వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో తలపడనుందని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. వన్డే ఫార్మాట్‌కు హార్దిక్‌ పాండ్య లేదా రోహిత్‌లో ఎవరు కెప్టెన్సీ చేపడతారా? అనే ప్రశ్నకు జైషా సమాధానం ఇచ్చారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్ఇండియా చేరితే.. అక్కడా రోహితే సారథ్యం వహిస్తాడని జైషా తెలిపారు. 11 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించిన హిట్‌మ్యాన్‌ (Rohit Sharma) ‘టీ20’లకు వీడ్కోలు పలికారు. అతడితోపాటు విరాట్, రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. వీరంతా ఇక టెస్టులు, వన్డేలపైనే దృష్టి పెడతారని క్రికెట్ పెద్దలు అప్పుడే వ్యాఖ్యానించారు. డబ్ల్యూటీసీని గెలిచే బాధ్యతను ఇప్పటికే రోహిత్‌, విరాట్‌కు మాజీ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ అప్పగించిన సంగతి తెలిసిందే. 

వచ్చే ఏడాది జూన్‌లో మూడో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final) జరగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోఉంది. వచ్చే ఏడాది మార్చినాటికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌లో తలపడతాయి. టీమ్‌ ఇండియా ఇప్పటికే రెండుసార్లు ఫైనల్‌కు చేరినా విజేతగా నిలవలేదు. మరోవైపు ఎనిమిది దేశాలు పాల్గొనే ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పీసీబీ అందజేసింది. మార్చి 1న లాహోర్‌ వేదికగా భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే, ఈ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌కు బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. 

భద్రతాపరమైన, రవాణా కారణాల దృష్ట్యా భారత్‌ మ్యాచ్‌లన్నింటినీ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు పరిమితం చేశారు. భారత్‌ సెమీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్‌ కూడా అక్కడే నిర్వహిస్తారు. గ్రూప్‌ ఎలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్.. గ్రూప్‌ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని