IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్‌ఇండియాలో 13 మందే

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో వన్డేకు టీమ్‌ఇండియాలో 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేర్కొన్నాడు.

Published : 26 Sep 2023 21:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (సెప్టెంబరు 27న) రాజ్‌కోట్‌లో చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టులో 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేర్కొన్నాడు. మొదటి రెండు వన్డేల్లో ఆడిన శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చామని.. శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ షమి వ్యక్తిగత కారణాలతో తమ ఇళ్లకు వెళ్లారని రోహిత్ పేర్కొన్నాడు. మూడో వన్డేకు అందుబాటులో ఉండాల్సిన హార్దిక్ పాండ్య కూడా వ్యక్తిగత కారణాలతో ఇంకా ఇంటి వద్దే ఉన్నట్లు చెప్పాడు. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. మొదటి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రోహిత్, కోహ్లీ, కుల్‌దీప్‌ యాదవ్‌ తిరిగి జట్టుతో కలిశారు. రెండో వన్డేలో ఆడని బుమ్రా కూడా రాజ్‌కోట్‌లో టీమ్‌తో చేరాడు. 

మూడో వన్డేకు అందుబాటులో ఉన్న 13 మంది ఆటగాళ్లు: 

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అశ్విన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ముఖేశ్‌ కుమార్. ఇప్పటికే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న జడేజాకు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశముంది. పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుందని భావిస్తే అందుబాటులో ఉన్న ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, ముకేశ్‌లతో బరిలోకి దిగొచ్చు. స్పిన్‌కు అనుకూలిస్తే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం సుందర్‌, ముఖేశ్ ఆసియా క్రీడల కోసం చైనాకు బయల్దేరనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని