Updated : 20 Feb 2022 14:48 IST

BCCI: ట్రెండింగ్‌లో బీసీసీఐ పాలిటిక్స్‌.. మూడేళ్ల నాటి రోహిత్‌ ట్వీట్‌ వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను జట్టులో నుంచి అర్ధాంతరంగా తొలగించడం, అలాగే ఓ జర్నలిస్టు అతడిని ఇంటర్వ్యూ ఇవ్వాలని బలవంతం చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెల శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు శనివారం బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించగా అందులో సాహాను ఎంపిక చేయలేని సంగతి తెలిసిందే. మరోవైపు అతడితో పాటు ఇటీవల సరిగ్గా ఆడని పుజారా, రహానె, ఇషాంత్‌ను కూడా తొలగించారు. అయితే, టెస్టు జట్టు ప్రకటించాక సాహా మాట్లాడుతూ తనకు ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు. తొలుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనని రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలని సూచించాడని, అంతకుముందు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తాను పదవిలో ఉన్నంత కాలం జట్టులో చోటు ఉంటుందనే భరోసా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. అనంతరం ఓ ట్వీట్‌ చేసిన సాహా.. తనని ఇంటర్వ్యూ ఇవ్వాలని ఓ జరల్నిస్టు వాట్సాప్‌లో బలవంతం చేసిన మెసేజీలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఒక్కసారిగా టీమ్‌ఇండియా అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబెకింది. బీసీసీఐలో రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ ట్విటర్‌లో వరుసగా పోస్టులు పెడుతున్నారు. అతడి విషయంలో చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ వ్యవహరించిన తీరు సరికాదని మండిపడుతున్నారు. సాహాను తొలగించడానికి కారణం చెప్పబోమని, అది సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం అని చేతన్‌ పేర్కొనడంతో నెటిజన్లు అతడిపైనా, ఆ జర్నలిస్టుపైనా, టీమ్‌ఇండియా యాజమాన్యంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో #BCCIPolitics #Wriddhiman Saha, #BCCI అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

రోహిత్‌ మూడేళ్ల ట్వీట్‌ వైరల్‌..

మరోవైపు టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం అతడిని బీసీసీఐ నూతన టెస్టు సారథిగా నియమించాక ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. 2018 సెప్టెంబర్‌ 1న అతడు ట్విటర్‌లో అభిమానులతో #AskRohit పేరిట ముచ్చటించిన సందర్భంగా.. తన ఫేవరెట్‌ కొటేషన్‌ ఏంటని ఓ అభిమాని అడిగారు. దానికి స్పందిస్తూ ‘తనని ఎంత అణచివేస్తే అంత పైకి తిరిగొస్తా’నని హిట్‌మ్యాన్‌ బదులిచ్చాడు. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లీ నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందుకున్న అతడు తాజాగా టెస్టు పగ్గాలూ అందుకున్నాడు. దీంతో రోహిత్‌ను మూడు ఫార్మాట్లకూ సారథిగా ఎంపిక చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పాత ట్వీట్‌ను కూడా తిరిగి షేర్‌ చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు టెస్టులకు పనికిరాడు అని పక్కనపెట్టిన ఆటగాడే ఇప్పుడు టీమ్‌ఇండియా జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని