Rohit Sharma : ఆటపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై కాదు : ఆసీస్‌ ఆరోపణలకు రోహిత్‌ గట్టి కౌంటర్‌

ఏదైనా సిరీస్‌కు ముందు మాటలతో కవ్వించే ఆస్ట్రేలియా.. ఈ సారి పిచ్‌పై ఆరోపణలు చేసింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ( Border-Gavaskar Trophy)లో భాగంగా తొలి మ్యాచ్‌ జరిగే నాగ్‌పుర్‌ పిచ్‌పై అక్కసు వెళ్లగక్కింది. అయితే ఈ ఆరోపణలకు టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ(Rohit Sharma) దీటుగా బదులిచ్చాడు.

Published : 08 Feb 2023 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ( Border-Gavaskar Trophy) ప్రారంభానికి ఒక్క రోజు ముందు తొలి టెస్టు(IND vs AUS) జరిగే నాగ్‌పూర్‌ పిచ్‌పై ఆస్ట్రేలియా మాజీలు, అక్కడి మీడియా వర్గాలు ఆరోపణలు చేశాయి. పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చకుంటున్నారని భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ ఆరోపణలపై టీమ్‌ఇండియా(Team India) కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఆటపై దృష్టి పెట్టాలని.. పిచ్‌పై కాదంటూ ప్రత్యర్థికి కౌంటర్‌ ఇచ్చాడు.

బుధవారం జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ఆటపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై కాదు. ఇక్కడ ఆడే 22 మంది ఆటగాళ్లు నాణ్యమైన ఆటగాళ్లే’ అంటూ  సమాధానమిచ్చాడు. ఇక పిచ్‌ గురించి మాట్లాడుతూ.. ఇది స్పిన్నర్లకు సహకరిస్తుందని.. ఈ పరిస్థితుల్లో స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. ‘ప్రణాళికతో ఆడటం ఎంతో ముఖ్యం. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. కొందరు స్వీప్‌ షాట్లు ఆడటానికి ఇష్టపడతారు. కొందరు బౌలర్‌పై నుంచి కొట్టడానికి ప్రయత్నిస్తారు. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం అవసరం. కొన్నిసార్లు ఎదురు దాడి చేయాలి’ అని రోహిత్‌ వివరించాడు.

ఇక ఈ సిరీస్‌ గురించి మాట్లాడుతూ..‘ఇదొక ఛాలెంజింగ్‌ సిరీస్‌. ఈ సిరీస్‌ను మేం గెలవాలనుకుంటున్నాం. సన్నద్ధతే కీలకం. మనం బాగా సిద్ధమైతే.. అందుకు తగ్గ ఫలితాలను పొందొచ్చు’ అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని