IND vs AUS: ఇలాంటి పిచ్‌పై త్వరగా ఔట్‌ కావడం రోహిత్‌కు చిరాకు తెప్పిస్తుంది: సంజయ్‌

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్‌ బ్యాటర్లు అదరగొట్టగా.. భారత్ క్రికెటర్లు కూడా దీటుగానే జవాబు ఇస్తున్నారు. అయితే కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) త్వరగా ఔటై నిరాశపడ్డాడు.

Published : 11 Mar 2023 22:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) సిరీస్‌ కోసం ఎంపిక చేసిన మైదానాల్లో..  బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌ ఏదైనా ఉందంటే అది అహ్మదాబాద్‌ పిచ్‌ మాత్రమేనని అందరికీ తెలుసు. ఎందుకంటే గత మూడు టెస్టుల్లోనూ స్పిన్నర్ల దెబ్బకు బ్యాటర్లు హడలెత్తిపోయారు. నాలుగో టెస్టు జరుగుతున్న (IND vs AUS) అహ్మదాబాద్‌లో మాత్రం బ్యాటర్లదే హవా. తొలి రెండు రోజులు ఆసీస్‌ బ్యాటర్లు ఆడగా.. మూడో రోజు కూడా భారత బ్యాటర్లు అదరగొట్టారు. అయితే, అద్భుత ఆరంభం లభించినప్పటికీ టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ (35) మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతడితోపాటు ఛెతేశ్వర్‌ పుజారా (42) కూడా అర్ధశతకానికి కాస్త దూరంలో పెవిలియన్‌కు చేరాడు. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కునెమన్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ ఆడి రోహిత్ (Rohit Sharma) పెవిలియన్‌కు చేరాడు.  ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ స్పందించాడు. నిరాశగా పెవిలియన్‌కు చేరిన రోహిత్‌కు ఇలా ఔట్ కావడం తప్పకుండా చిరాకు తెప్పించే ఉంటుందని వ్యాఖ్యానించాడు. 

‘‘రోహిత్ శర్మ ఔటైన తర్వాత మైదానంలో నుంచి బయటకు వెళ్లేందుకు అతడి కాలు ముందుకు పడలేదు. కఠినమైన పిచ్‌లపైనా చాలా బాగా ఆడతాడు. అందుకు ఉదాహరణ తొలి టెస్టులో సెంచరీ సాధించడం. అలాంటి రోహిత్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఇలాంటి పిచ్‌పై త్వరగా ఔట్‌ కావడం మాత్రం అతడికి తీవ్రంగా చిరాకు తెప్పించే ఉంటుంది’’ అని మంజ్రేకర్ తెలిపాడు. దీంతో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆసీస్‌ మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్‌ కూడా స్పందించాడు. ఇలాంటి అనుభవమే ఉస్మాన్‌ ఖవాజా ఔటైనప్పుడు జరిగిందని తెలిపాడు. అవాంఛనీయ తప్పిదాలు చోటు చేసుకోవడం సహజమేనని వ్యాఖ్యానించాడు. తప్పకుండా రోహిత్‌ అసహనానికి గురై ఉంటాడని తెలిపాడు. ప్రస్తుతం నాలుగో టెస్టులో భారత్  నిలకడగా ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (59*), రవీంద్ర జడేజా (16*) ఉన్నాడు. అంతకుముందు శుభ్‌మన్‌ గిల్ (128) సెంచరీతో అలరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు