Rohit Sharma: ‘దాన్ని కొంచెం రహస్యంగా ఉండనీయండి’: రోహిత్‌ శర్మ

మ్యాచ్‌ల సమయంలో  నిర్వహించే విలేకర్ల సమావేశంలో భారత సారథి రోహిత్‌ శర్మ చాలా సరదాగా ఉంటారు..! ఆయన విలేకర్లపై పంచులు విసురుతూ నవ్వులు పూయిస్తారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది.

Updated : 28 Aug 2022 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మ్యాచ్‌ల సమయంలో నిర్వహించే విలేకర్ల సమావేశంలో భారత సారథి రోహిత్‌ శర్మ చాలా సరదాగా ఉంటాడు..! విలేకర్లపై పంచులు విసురుతూ నవ్వులు పూయిస్తాడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. శనివారం రోహిత్‌ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ పాకిస్థానీ జర్నలిస్టు నుంచి భారత ఓపెనింగ్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ‘‘గత కొన్ని సిరీసుల నుంచి భారత్‌ కొత్త కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. కొన్ని సార్లు పంత్‌ వస్తే.. మరికొన్ని సార్లు సూర్యకుమార్‌ యాదవ్‌ వస్తున్నాడు. కేఎల్‌ రాహుల్‌ లేకపోవడంతోనే ఇలా చేస్తున్నారా..? ఇప్పుడతడు వచ్చేశాడుగా. అతడి స్థానంలోనే వస్తాడా లేదా రేపు మీతోపాటు కొత్త ఓపెనింగ్‌ భాగస్వామి కనిపిస్తాడా..?’’అని అడిగాడు. 

మ్యాచ్‌ వ్యూహాన్ని బయటకు వెల్లడించేందుకు ఇష్టపడని హిట్‌మ్యాన్‌.. సరదాగా ఆ ప్రశ్నను దాటవేశాడు. ‘‘ఆదివారం టాస్‌ వేశాక మీరే చూడండి.. ఎవరు వస్తారో. మమ్మల్ని కూడా కొన్ని రహస్యాలను దాచుకోనీయండి మిత్రమా. మేం కొత్తవి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. వాటిల్లో కొన్ని పని చేస్తే.. మరికొన్ని ఫలితాన్ని ఇవ్వవు. ప్రయత్నించడంలో తప్పులేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కొత్తవి ప్రయత్నిస్తాం’ అని రోహిత్‌ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇంకో పది పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అవతరిస్తాడు. ప్రస్తుతం 3,487 పరుగులతో రెండు స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ 3,497 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని