FIFA: వరల్డ్‌కప్‌ గెలవాలంటే ఇలాంటి ఆటగాడు ఒక్కడు చాలు అనిపించిన రొనాల్డో..!

బ్రెజిల్‌ ఆటగాడు రొనాల్డో 2002 ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపాడు. జట్టు మొత్తం కలిసి చేసిన 16గోల్స్‌లో రొనాల్డోనే 8 చేశాడంటే ఆటతీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్స్‌లో అయితే చెలరేగిపోయాడు. 

Updated : 29 Nov 2022 11:02 IST

(ఫొటో: ఫిఫా వరల్డ్‌కప్‌ ఫేస్‌బుక్‌ పేజీ నుంచి)

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ జట్టు పేరు చెబితే పీలే గుర్తుకొస్తాడు. కానీ.. ఒంటిచేత్తో బ్రెజిల్‌కు ప్రపంచకప్‌ అందించిన రొనాల్డో పేరు మాత్రం వెంటనే స్ఫురణకు రాదు. 2002 ప్రపంచకప్‌ నాటికి.. కాఫు, రివాల్డో, రోనాల్డిన్హో, రొనాల్డో వంటి సూపర్‌స్టార్లతో  బ్రెజిల్‌ జట్టు అత్యంత శక్తిమంతంగా ఉంది. ఈ చుక్కల్లో కూడా రొనాల్డో చంద్రుడిలా వెలిగిపోయాడు. ఈ టోర్నీలో బ్రెజిల్‌ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మొత్తం 16 గోల్స్‌ కొడితే.. ఒక్క రొనాల్డోనే 8 చేశాడంటేనే అతడి భీకరమైన ఫామ్‌ను అర్థం చేసుకోవచ్చు. అతడి సహచరుడు రివాల్డో (5 గోల్స్‌) సహకరించడంతో ప్రపంచకప్‌ను బ్రెజిల్‌ సునాయాసంగా ఒడిసి పట్టింది.

ఈ టోర్నీలో ఏ దశలోనూ ఒక్క ఓటమి కూడా లేకుండా బ్రెజిల్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. అప్పటికే టోర్నీలో రొనాల్డో 6 గోల్స్‌ చేశాడు. మరో వైపు ఫైనల్‌కు చేరిన జర్మనీ జట్టు కూడా బలంగా ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో గోల్‌పోస్టుపై బ్రెజిల్‌ జట్టు దాడులను జర్మనీ ఆటగాళ్లు.. గోల్‌ కీపర్‌ ఓలివర్‌ కాన్‌తో కలిసి సమర్థంగా అడ్డుకొన్నారు. బ్రెజిల్‌ ఆటగాడు జోస్‌ కెల్బిర్సన్‌కు రెండు సార్లు గోల్స్‌ చేసే అవకాశం వచ్చినా.. వాటిని వినియోగించుకోలేకపోయాడు. మ్యాచ్‌ రెండో అర్ధభాగంలో రొనాల్డో మ్యాజిక్‌ మొదలైంది. జర్మన్‌ ఆటగాడి నుంచి అతడు బంతిని ఆధీనంలోకి తీసుకొన్నాడు. రొనాల్డో బంతిని రివాల్డోకు పాస్‌ చేయగా.. అతడు గోల్‌పోస్టువైపు కొట్టాడు. కానీ, జర్మనీ గోల్‌ కీపర్‌ ఓలివర్‌ కాన్‌ అడ్డుకొన్నాడు. దీంతో ప్లే ఏరియాలో పడిన బంతిని మెరుపువేగంతో రొనాల్డో గోల్‌పోస్టులోకి తరలించాడు. దీంతో 67వ నిమిషంలో బ్రెజిల్‌కు ఆధిక్యం లభించింది. బ్రెజిల్‌ మ్యాచ్‌లో దూకుడును పెంచింది.. మరో 12 నిమిషాల తర్వాత  కెల్బిర్సన్‌ ఇచ్చిన పాస్‌ను రివాల్డో రెండుకాళ్ల మధ్యలో నుంచి వదిలేశాడు. దానిని రొనాల్డో అందిపుచ్చుకొని జర్మనీ గోల్‌ పోస్టులోకి పంపాడు. దీంతో బ్రెజిల్‌కు 2-0 ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్‌లో జర్మనీ ఏ దశలోనూ కోలుకోలేదు. ప్రపంచకప్‌ 5వ సారి బ్రెజిల్‌ సొంతమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని