RCB-WPL: ఆర్‌సీబీ కీలక నిర్ణయం.. మహిళా జట్టుకు మెంటార్‌గా సానియా మీర్జా

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తన మహిళా జట్టు కోసం టెన్నిస్‌ దిగ్గజ క్రీడాకారిణిని మెంటార్‌గా నియమించింది.

Updated : 15 Feb 2023 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి టోర్నీకి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం, ప్రసార హక్కుల బిడ్‌లు అన్నీ ముగిశాయి. ఇక మార్చి 4వ తేదీ నుంచి పోటీల సందడి మొదలు కానుంది. ఈ క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకొంది. తమ మహిళల జట్టుకు మెంటార్‌గా భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాను (Sania Mirza) నియమించింది. ఈ మేరకు ఆర్‌సీబీ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. ఇటీవలే సానియా తన ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

సానియాను మెంటార్‌గా నియమించడంపై ఆర్‌సీబీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్ రాజేశ్‌ వి మేనన్‌ స్పందించారు. ‘‘ ఆర్‌సీబీ మహిళా జట్టుకు సానియా మీర్జాను మెంటార్‌గా నియమించడం గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. కష్టపడేతత్వంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆమె సరైన వ్యక్తిగా మేం భావించాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మరీ ఈ స్థాయికి చేరింది. యువ తరానికి మార్గదర్శకంగా నిలిచే ఆమె మరింతమందిలో స్ఫూర్తిని రగిలించగలదు. కఠిన పరిస్థితుల్లో ఎలా రాణించాలనే విషయాలను యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయగలదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన సానియా మీర్జా తప్పకుండా జట్టును ఉత్తమ పద్ధతిలో నడిపిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.

ఆర్‌సీబీకి మెంటార్‌గా నియమించడంపై సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ఆర్‌సీబీ మహిళా జట్టుతో కలవడం సంతోషంగా ఉంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌తో ఉమెన్స్‌ క్రికెట్‌ ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయం. ఇలాంటి మెగా లీగ్‌ల వల్ల చిన్నారులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి మార్గమవుతుంది. మెంటార్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహంతో ఉన్నా. చాలా ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ క్రేజ్‌ ఉన్న జట్టు’’ అని సానియా వ్యాఖ్యానించింది. భారత టాప్‌ మహిళా క్రికెటర్‌ స్మృతీ మంధానను (Smriti Mandhana) రూ. 3.4 కోట్లు పెట్టి మరీ ఆర్‌సీబీ సొంతం చేసుకొంది. తమకు కేటాయించిన నిధుల్లో మూడో వంతు స్మృతీ కోసమే కేటాయించడం విశేషం. ఆర్‌సీబీ మహిళా జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆసీస్‌కు చెందిన బెన్‌ స్వెయర్‌ను నియమించింది. ప్రస్తుతం స్వెయర్‌ న్యూజిలాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టుకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని