RR vs RCB: రాజస్థాన్‌ ఆలౌట్.. బెంగళూరు సూపర్‌ విక్టరీ

ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు విజృంభించారు.

Updated : 14 May 2023 18:55 IST

జైపుర్‌: ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్థాన్‌పై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌటైంది. హెట్‌మయర్ (35) టాప్‌ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో పార్నెల్‌ (3/10), బ్రాస్‌వెల్ (2/16), కర్ణ్ శర్మ (2/19), సిరాజ్‌ (1/10), మ్యాక్స్‌వెల్ (1/3) ప్రత్యర్థిని గట్టి దెబ్బ తీశారు. 

రాజస్థాన్‌కు తొలి ఓవర్‌ నుంచే ఆర్సీబీ బౌలర్లు వరుస షాక్‌లు ఇచ్చారు. సిరాజ్‌ వేసిన మొదటి ఓవర్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ (0) కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చాడు. పార్నెల్‌ వేసిన రెండో ఓవర్‌లో బట్లర్ (0) సిరాజ్‌కు చిక్కగా..  సంజు శాంసన్ (4)   వికెట్ కీపర్‌ అనుజ్‌ రావత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. బ్రాస్‌వెల్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి దేవదత్‌ పడిక్కల్‌ (4) సిరాజ్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. జో రూట్‌ (10) పార్నెల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ధ్రువ్ జురెల్ (1).. బ్రాస్‌వెల్ వేసిన ఏడో ఓవర్లో చివరి బంతికి మహిపాల్ లామ్రోర్‌కు చిక్కాడు. కర్ణ్‌ శర్మ వేసిన ఎనిమిదో ఓవర్‌లో హెట్‌మయర్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదిన తర్వాత చివరి బంతికి అశ్విన్‌ (0) రనౌట్‌ అయ్యాడు. దూకుడుగా ఆడుతున్న హెట్‌మయర్‌ మ్యాక్స్‌వెల్ వేసిన 9.5 బంతికి బ్రాస్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కర్ణ్‌ వేసిన 11 ఓవర్లో ఆడమ్‌ జంపా (2) క్లీన్‌బౌల్డ్ కాగా.. కేఎం ఆసిఫ్‌ (0) కోహ్లీకి క్యాచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ ఆలౌటైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ (55; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో అనుజ్‌ రావత్ (29*; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు స్కోరు 170 దాటింది. విరాట్ కోహ్లీ (18) పరుగులు చేయగా.. మహిపాల్ లామ్రోర్ (1), దినేశ్ కార్తిక్‌ (0) విఫలమయ్యారు. మైఖేల్ బ్రాస్‌వెల్ (9*) నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆసిఫ్‌, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని