IPL 2022: అతడితో ఆడేందుకు ఎదురు చూస్తున్నా: రియాన్ పరాగ్‌

టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌ రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ అన్నాడు. క్రికెట్లో ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అతడు..

Published : 17 Mar 2022 01:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌ రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ అన్నాడు. క్రికెట్లో ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అతడు పేర్కొన్నాడు. ‘ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్‌ది ప్రత్యేక స్థానం. అలాంటి దిగ్గజ ఆటగాడితో కలిసి పని చేసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అతడి బౌలింగ్‌లోని వైవిధ్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. పలు సూచనలు కూడా తీసుకుంటాను. ఈ సీజన్‌ తర్వాత నా బౌలింగ్‌ కచ్చితంగా మరింత మెరుగవుతుంది’ అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో రూ.5 కోట్ల భారీ మొత్తానికి సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ని రాజస్థాన్‌ యాజమాన్యం కొలుగోలు చేసిన విషయం తెలిసిందే.

‘రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతోనే నా ఐపీఎల్ ప్రయాణం మొదలైంది. ఇటీవల ముగిసిన మెగా వేలంలోనూ రాజస్థాన్‌ యాజమాన్యం నాపై నమ్మకం ఉంచి మళ్లీ దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేలంలో నాకోసం నాలుగు జట్లు బిడ్‌ వేశాయి. అది చాలా గొప్ప విషయం. అది చూసినప్పుడు నేను సరైన దారిలోనే వెళ్తున్నాననే నమ్మకం కలిగింది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించాను. బౌలింగ్‌లోనూ తొలిసారిగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాను. క్రికెట్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఐపీఎల్‌లో 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ఫినిషర్‌ పాత్ర పోషించడం చాలా కష్టం. ఇంతకు ముందు ఫినిషర్‌గా బరిలోకి దిగాలంటే కాస్త ఆందోళనగా ఉండేది. ఈ సీజన్‌లో గొప్పగా రాణించగలననే నమ్మకం ఉంది’ అని రియాన్ పరాగ్ అన్నాడు. గత మూడేళ్లుగా రాజస్థాన్‌ జట్టు తరఫున ఆడుతున్న రియాన్‌.. 30 మ్యాచుల్లో 118.53 స్ట్రైక్‌ రేట్‌తో 339 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని