Ukraine Crisis: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2022 నుంచి రష్యా బహిష్కరణ

రష్యా ఫుట్‌బాల్‌ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. 

Updated : 01 Mar 2022 06:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో  అంతర్జాతీయంగా రష్యాను ఏకాకిని చేసేందుకు ఇప్పటికే అమెరికాతో సహా పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా రష్యా ఫుట్‌బాల్‌ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపాయి. ఈ ఏడాది చివరలో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు రష్యా పురుషుల జట్టు క్వాలిఫైయింగ్‌ ప్లే ఆఫ్‌ సెమీఫైనల్‌లో పోలాండ్‌తో మార్చి 24న తలపడనుంది. ఆ తర్వాత స్వీడన్‌ లేదా చెక్‌రిపబ్లిక్‌తో తలపడే అవకాశం ఉంది. అయితే ఈ మూడు జట్లు రష్యాతో ఆడడానికి నిరాకరించాయి. రష్యాను బహిష్కరించాలని పట్టుబట్టాయి. ఉక్రెయిన్‌ ప్రజల కోసం సంఘీభావంగా ఫుట్‌బాల్‌ ప్రపంచం ఐక్యంగా ఉందని ఫిఫా, యూఈఎఫ్‌ఏ తెలిపాయి. ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని, ఫుట్‌బాల్‌ క్రీడ ప్రజల మధ్య శాంతి, ఐక్యత నెలకొలుపుతుందని ఆశిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ అధ్యక్షులు జియాని ఇన్‌ఫాంటినో, అలెగ్జాండర్‌ సెఫెరిన్‌ తెలిపారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని