Ruturaj: అప్పుడు ప్లేఆఫ్స్‌ చేరలేదు.. ఇప్పుడు మా సక్సెస్‌ వెనుక కారణమదే: రుతురాజ్‌

గతేడాది పేలవ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ఈసారి పుంజుకొని ఫైనల్‌కు చేరింది. దీని వెనుక ఉన్న కష్టాన్ని రుతురాజ్‌ గైక్వాడ్ వెల్లడించాడు.

Updated : 24 May 2023 15:08 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్ (CSK) అవతరించింది. మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను (GT vs CSK) ఓడించి మరీ అడుగుపెట్టింది. సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఇదే గుజరాత్‌ చేతిలో చెన్నై ఓటమిపాలైంది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు ఐదో టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ పలు విషయాలు వెల్లడించాడు. చెపాక్‌ స్టేడియంలో కొత్త పిచ్‌ కావడంతో తమ ఆటగాళ్లంతా జాగ్రత్తగా ఆడటంపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నాడు.

‘‘ప్రతి ఒక్కరికీ పిచ్‌ ఎలా మారుతుందనే దానిపై అవగాహన లేదు. ఫ్లాట్‌ ట్రాక్స్‌ మీద ఆడినప్పుడు మంచి షాట్ల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థి బౌలింగ్‌ గురించి ఆందోళన పడక్కర్లేదు. కానీ, క్లిష్టమైన పిచ్‌లపై చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు సహచర బ్యాటర్‌ మంచి షాట్లు ఆడినా మనం కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. 

నాతో సహా చాలా మంది ఆటగాళ్లు ఈ సీజన్‌కు ముందు వరకు చెన్నైలో ఆడలేదు. మా విజయంలో అందరి కష్టం ఉంది. గత సీజన్‌లో మేం ప్లేఆఫ్స్‌ చేరుకోలేకపోయాం. అప్పటి నుంచే మా మేనేజ్‌మెంట్‌ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా మార్చి 3వ తేదీ నుంచే కెప్టెన్‌ ధోనీతోపాటు సీనియర్లు రహానె, అంబటి రాయుడు క్యాంప్‌లోకి వచ్చేశారు. ఈ ఏడాది తొలి మ్యాచ్‌ నుంచే ఎవరు ఆడాలి..? ఏ స్థానంలో ఆడించాలి..?  ఎవరు డగౌట్‌కు పరిమితం కావాలి...? వంటి అంశాలపై స్పష్టతతో ఉన్నాం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏంటో తెలుసు. తీక్షణ, పతిరణ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ.. ఆడిన మొదటి మ్యాచ్‌ నుంచే ప్రభావం చూపారు. ఒకే జట్టుతో మళ్లీ ఆడే అవకాశం రావొచ్చు. అప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో బరిలోకి దిగుతాం. మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బందితోపాటు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి హ్యాట్సాఫ్‌’’ అని రుతురాజ్‌ తెలిపాడు. రుతురాజ్‌ 44 బంతుల్లో 60 పరుగులు చేసి చెన్నై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని