Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్‌ మాజీకి శ్రీశాంత్ కౌంటర్

వరల్డ్ కప్ (ODI World Cup 2023) ప్రారంభానికి ముందే మాజీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. కివీస్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీశాంత్ స్పందించాడు. 

Updated : 28 Sep 2023 10:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో వారం రోజుల్లో వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) ప్రారంభం కానుంది. మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియా ప్రదర్శనపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్‌ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ సీమర్‌ శ్రీశాంత్‌ అద్భుతమైన కౌంటర్ ఇచ్చాడు. పెద్ద టోర్నీల్లో టీమ్ఇండియా దూకుడుగా ఆడలేదని సైమన్‌ ఇటీవల వ్యాఖ్యానించగా.. ఇలాంటి మాటలు విరాట్ కోహ్లీ చెవినపడితే మీ పని అంతేనని శ్రీశాంత్‌ బదులిచ్చాడు. ఇతరుల గురించి మాట్లాడే ముందు.. మీ జట్టు పరిస్థితిని కూడా గమనించుకోవాలని సూచించాడు.

‘‘వరల్డ్ కప్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ జట్టు భారత్‌కు వస్తోంది. టీమ్‌ఇండియా దూకుడుగా ఆడుతుందా..? లేదా? అనేది వారికి తెలుస్తుంది. తప్పకుండా వారిని చిత్తు చేస్తుంది. 2019లో లక్కీగా న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకుంది. అదీనూ సెమీస్‌లో ఎంఎస్ ధోనీ రనౌట్‌ కావడం వల్లే. లేకపోతే అక్కడికి కష్టమయ్యేది. ఫైనల్‌లో విజేతగా నిలిచిందా? అంటే అదీ లేదు. ఇంగ్లాండ్‌కు కప్‌ను అప్పగించింది. ఇప్పటి వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ను మాత్రం న్యూజిలాండ్ దక్కించుకోలేదు. అందుకే, ఎదుటి జట్టు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేసేముందు మీ సంగతి కూడా ఓ సారి ఆలోచించుకోవాలి. అవతలివారికి పంచ్‌ ఇవ్వాలని భావిస్తే.. వారు తిరిగిచ్చే పంచ్‌ను కూడా స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి.

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్‌ జట్టుపై నో డౌట్స్: రోహిత్

ఈ ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. అప్పుడు కివీస్‌కు టీమ్‌ఇండియా షాక్‌ ఇవ్వడం ఖాయం. ఈసారి న్యూజిలాండ్‌ గుణపాఠాలు నేర్చుకొంటుంది. గత ఐసీసీ ఈవెంట్లలో మాపై కొన్ని విజయాలు నమోదు చేసింది. ఆ రోజులు ముగిశాయి. ఇంకా ఏదైనా వ్యాఖ్యలు చేద్దామని భావిస్తే మాత్రం విరాట్‌ కోహ్లీని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఏమన్నారో అతడి దృష్టికి వెళ్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అప్పుడు పోటీ ఇంకా రసవత్తరంగా ఉంటుంది’’ అని శ్రీశాంత్‌ వ్యాఖ్యానించాడు. 

అక్టోబర్ 5న న్యూజిలాండ్- ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ప్రారంభం కానుంది. అయితే, ఆలోపు అన్ని జట్లూ వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత్‌ కూడా ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌తో వార్మప్‌ మ్యాచ్‌లను ఆడనుంది. అక్టోబర్ 22న భారత్-కివీస్‌ జట్ల మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని