IND vs SA: టెస్టు సిరీస్‌కు నార్జ్‌ దూరం.. దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ

టీమ్ఇండియాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ముందే దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్‌ అన్రిచ్‌ నార్జ్‌ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

Published : 22 Dec 2021 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ముందే దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్‌ అన్రిచ్‌ నార్జ్‌ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) ధ్రువీకరించింది. అన్రిచ్‌ నార్జ్‌ గైర్హాజరీతో మరో పేసర్‌ కగిసో రబాడ పేస్‌ దళాన్ని నడిపించనున్నాడు. 

‘గత కొద్ది కాలంగా గాయంతో బాధపడుతున్న అన్రిచ్ నార్జ్‌ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అందుకే, టెస్టు సిరీస్ నుంచి పక్కన పెట్టాం. అతడి స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు 12 టెస్టులు ఆడిన నార్జ్‌.. 47 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం. 

మరోవైపు, టీమ్‌ఇండియాలో కూడా పలువురు కీలక ఆటగాళ్లు టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాతో పాటు యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్, అక్షర్ పటేల్‌ గాయాల బారిన పడటంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్ శర్మ జనవరిలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, జడేజా విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వన్డే సిరీస్‌ ప్రారంభం అయ్యే నాటికి అతడు కోలుకుంటాడా? లేదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని