IND vs SL: అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సాంకేతిక లోపం.. పునరావృతం కాకూడదు: మాజీలు

శ్రీలంకతో రెండో టీ20లో భారత్ (ind vs sl 2023) ఓడిపోవడానికి ప్రధాన కారణం నో బాల్స్. యువ బౌలర్ అర్ష్‌దీప్‌ (Arshdeep) ఏకంగా ఐదు నోబాల్స్ వేసి తీవ్ర విమర్శలపాలయ్యాడు. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే.

Updated : 07 Jan 2023 19:00 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ తిరిగి ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత మాజీ సెలక్టర్‌ సబాకరీం అభిప్రాయపడ్డాడు. ఇది అతడు చేసిన పొరపాటును సరిచేసుకొని నిలకడగా ఆడటానికి సహాయపడుతుందని తెలిపాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఏకంగా 5 నోబాల్స్‌ వేశాడు. అతడు వేసిన నోబాల్స్‌ కారణంగా కెప్టెన్‌ హార్దిక్‌ అర్ష్‌దీప్‌కి చివరి వరకు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో అర్ష్‌దీప్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు చెలరేగాయి. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత అర్ష్‌దీప్‌కు సుదీర్ఘ విరామం ఇచ్చిన యాజమాన్య నిర్ణయం సరైంది కాదని కరీం తెలిపాడు. అలాగే అర్ష్‌దీప్‌ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘‘అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సాంకేతిక లోపం ఉంది. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. అతడు ఇలా ఆడటానికి గల కారణాలను కోచ్‌ విశ్లేషించాలి. బంతి వేయడానికి పరిగెత్తే సమయంలో లయ తప్పితే సాధారణంగా ఇలా జరుగుతుంది. అతడికి సుదీర్ఘ విరామం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమీ కలగలేదు. దేశవాళీ క్రికెట్‌ ఆడలేదు. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే అర్థం చేసుకోవచ్చు. కానీ టీ20 మ్యాచ్‌లో ఎక్కువగా నోబాల్స్‌ వేయడం సమంజసం కాదు. అతడు మళ్లీ ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ పొందాలి. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే నిలకడగా బౌలింగ్‌ వేయగలడు’’ అని కరీం పేర్కొన్నాడు.

అందుకే నిలకడ కోల్పోతారు: చోప్రా

‘‘గురువారం మ్యాచ్‌లో జరిగింది అసాధారణమైనది. ఎవరూ కూడా నో బాల్స్‌ ఎక్కువ వేయకూడదు. గత 12 నెలల నుంచి అర్ష్‌దీప్‌ చాలా నో బాల్స్‌ వేశాడు. ఈ సమస్య తనలో పునరావృతమవుతోంది. కానీ అతడు తన తప్పును సరిదిద్దుకోగలడు. బౌలర్లకు కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుంది. చలి వల్ల నిలకడ కోల్పోతారు. ఆ సమయంలో ఆడితే సరైన చోట పాదాన్ని మోపలేరు. దాని వల్ల నమ్మకం కోల్పోయి పొరపాట్లు చేస్తుంటారు. వాటిని సరిదిద్దుకోవాలి. అర్ష్‌దీప్‌ తన తప్పును సరిచేసుకొని తిరిగి రాణిస్తాడనే నమ్మకం ఉంది’’ అని ఆకాశ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని