IPL 2023: విరాట్, రోహిత్.. టీ20 క్రికెట్‌కు దూరమైనట్లు ఉంది: మాజీ సెలెక్టర్‌

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్‌లో సరైన స్ట్రైక్‌రేట్‌ లేకుండా పరుగులు రాబట్టడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

Updated : 12 May 2023 19:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై తీవ్ర విమర్శలు రేగాయి. ఇద్దరూ ఓపెనర్లుగా వస్తున్నా.. రోహిత్ పరుగులు చేయడంలో విఫలం కాగా.. విరాట్ మాత్రం తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. అర్ధశతకాలు సాధించినా టీ20 క్రికెట్‌ సరిపడే ఆటతీరు కాదని మాజీలు, క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. వీరిద్దరూ దిగ్గజ క్రికెటర్లు అయినా పొట్టి ఫార్మాట్‌లో దూకుడు కొనసాగించలేకపోతున్నారని పేర్కొన్నారు.  మరోవైపు సూర్యకుమార్‌, యశస్వి జైస్వాల్ వంటి బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్‌ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీ20 క్రికెట్‌కు దూరమవుతున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. 

‘‘యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ను చూసిన తర్వాత.. ఒక విషయంలో మాత్రం స్పష్టత వచ్చినట్లు అనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 గేమ్‌ నుంచి దూరంగా జరిగినట్లు ఉంది’’ అని సబా కరీం పోస్టు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ 11 మ్యాచుల్లో 420 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ మాత్రం 133.76 కావడం విశేషం. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరు తీసికట్టుగా ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో కేవలం 124.84 స్ట్రైక్‌రేట్‌తో 191 పరుగులను మాత్రమే చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో యువ క్రికెటర్ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. 

హార్దిక్‌ అదే చెప్పాడు: రవిశాస్త్రి

‘‘టీ20 ప్రపంచకప్‌ 2024 మెగా టోర్నీ కోసం భారత జట్టులో ఎక్కువ మంది కొత్త మొహాలను చూసే అవకాశం ఉందని హార్దిక్‌ పాండ్య చెప్పాడు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉంటే మాత్రం కెప్టెన్సీ కూడా పాండ్యనే చేపడతాడు. ఐపీఎల్‌ సీజన్‌లో కుర్రాళ్లు అదరగొట్టేస్తున్నారు. 2007 టీ20 ప్రపంచ కప్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే, ఈ ఏడాది భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ముగిసేవరకు జట్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే బెటర్’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని