Bumrah : బుమ్రానే అత్యుత్తమం.. నాజర్‌ హుస్సేన్‌ కూడా అంగీకరించడం బాగుందన్న సచిన్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రాపై  (6/19) సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఇంగ్లాండ్‌..

Published : 13 Jul 2022 14:25 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రాపై  (6/19) సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బుమ్రా బెంబేలెత్తించాడు. దీంతో పది వికెట్ల తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో బుమ్రా ప్రదర్శనపై భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్, మైకెల్‌ వాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ చాలా బాగుంది : సచిన్‌

ఓవల్‌ పిచ్‌ బౌలింగ్‌కు బాగా అనుకూలించింది. బౌన్స్‌ బాగుంది. అయితే టీమ్‌ఇండియా బౌలర్లు సరైన లెంగ్త్‌లో బంతిని సంధించారు. భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రత్యేకంగా బుమ్రా ప్రదర్శన అసాధారణమైంది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్‌గా బుమ్రా ఎదిగాడు. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాజర్‌ హుస్సేన్ కూడా చెప్పాడు. ఓ చర్చ సందర్భంగా బుమ్రా గురించి నా అభిప్రాయం చెప్పగా.. హుస్సేన్‌ కూడా అంగీకరించడం ఆనందంగా ఉంది’’ అని సచిన్‌ పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్‌ గురించి నాజర్‌ హుస్సేన్ క్రీడా ఛానల్‌కు రాసిన వ్యాసంలోనూ ప్రస్తావించాడు. ‘‘ఇప్పుడు ఉన్న అత్యుత్తమ పేస్‌ బౌలర్లలో బుమ్రా ముందుంటాడు. ట్రెంట్ బౌల్ట్, షహీన్‌ అఫ్రిది, జోఫ్రా ఆర్చర్‌ నుంచి మాత్రమే బుమ్రాకు సవాల్‌ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం బుమ్రానే బెస్ట్‌ బౌలర్‌’’ అని హుస్సేన్ వివరించాడు.

అత్యుత్తమ బౌలర్‌ బుమ్రానే: మైకెల్ వాన్‌

టీమ్‌ఇండియా ఆటగాళ్లపై వ్యంగ్యంగా స్పందించే ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ కూడా బుమ్రా బౌలింగ్‌ను అభినందించాడు. ‘‘ బుమ్రా అత్యుత్తమ బౌలర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని ఫార్మాట్లలో అతడే ఉత్తమం. షహీన్‌ అఫ్రిది, ట్రెంట్‌ బౌల్ట్‌ కూడా ఉన్నప్పటికీ.. తన పేస్‌, నైపుణ్యం, స్వింగ్‌, యార్కర్లు, స్లో బాల్స్ సంధింస్తుండటంతో వారికంటే బుమ్రానే బెటర్‌ అనిపిస్తాడు.  గత కొన్నేళ్లుగా చాలా మంది బ్యాటర్లు ఇప్పటికే బుమ్రా బౌలింగ్‌లో ఆడేసి ఉంటారు. అయినా ఇప్పటికీ బుమ్రాను అన్ని ఫార్మాట్లలో ఎదుర్కోవడం ఇబ్బందే’’ అని మైకెల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని