Sachin - Gill: గిల్‌లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్

మూడు సెంచరీలు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా మారిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోసారి ఫైనల్‌లోనూ ఇదే ప్రదర్శన చేయాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ క్రమంలో గిల్‌ను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కూడా ప్రశంసించాడు.

Updated : 29 May 2023 12:10 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌ - గుజరాత్ టైటాన్స్‌ (CSK vs GT) మ్యాచ్‌ సందర్భంగా రెండు అంశాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అందులో ఒకటి వర్షం. రెండోది సెంచరీలతో మోతమోగిస్తున్న గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఫైనల్‌ నేటికి వాయిదా పడింది. ఇవాళ కూడా వరుణుడి ముప్పు తప్పదనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వర్షం తగ్గి మ్యాచ్‌ జరిగితే మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను అడ్డుకోవడానికి చెన్నై బౌలర్లు కాస్త కష్టపడాల్సిందే. బెంగళూరు, ముంబయి జట్లపై సెంచరీలు సాధించిన గిల్‌పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కీలకమైన రెండో క్వాలిఫయర్‌లో ముంబయిపై అలవోకగా శతకం బాదేశాడు. ఈ క్రమంలో ముంబయి మెంటార్, క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూడా గిల్ ప్రదర్శనపై అభినందనలు తెలిపాడు. బ్యాటింగ్‌లో దూకుడు.. మైదానంలో ప్రశాంతంగా ఉండే లక్షణాలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు.  

‘‘ఈ సీజన్‌లో శుభ్‌మన్‌ గిల్ ప్రదర్శన అద్భుతం. కీలక సమయంలో  చేసిన రెండు శతకాలను ఎప్పటికీ మరిచిపోలేం. అందులో ఒకటి ముంబయి ఆశలను బతికించగా.. మరొకటి విపరీతంగా దెబ్బ తీసిన సెంచరీ కావడం విశేషం. క్రికెట్‌ స్వభావం అలానే ఉంటుంది. శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌లో నన్ను ఆకట్టుకున్న అంశాలు.. దూకుడుగా ఆడాలనే స్వభావం, ఎంతో ప్రశాంతంగా ఆడటం, పరుగుల కోసం తాపత్రయం, వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడం గిల్‌ను ప్రత్యేకంగా నిలిపాయి’’ అని సచిన్ పేర్కొన్నాడు.  ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్ ఈ సీజన్‌లో 851 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అతడికి దరిదాపుల్లోనూ ఎవరూ లేరు. అయితే, ఫైనల్‌లోనూ మరో 122 పరుగులు చేస్తే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ(973) రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు