ShaneWarne : షేన్‌వార్న్‌తో అనుబంధం.. జీవితాంతం మరిచిపోలేం: సచిన్‌, లారా

 క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌తో జ్ఞాపకాలు జీవితాంతం తమ వెన్నంటే....

Published : 29 Mar 2022 17:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌తో జ్ఞాపకాలు జీవితాంతం తమ వెన్నంటే ఉంటాయని మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ తెందూల్కర్‌, వెస్టిండీస్‌ మాజీ స్టార్‌ బ్యాటర్‌ బ్రియాన్‌ లారా తెలిపారు. మార్చి 4న షేన్‌వార్న్‌ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా మరోసారి షేన్‌వార్న్‌తో తమ అనుబంధాన్ని సచిన్, లారా గుర్తు చేసుకున్నారు. ‘‘ షేన్‌వార్న్‌తో 1991లో తొలిసారి ఆడాను. ప్రైమ్‌మినిస్టర్ XIతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడా. పుష్టిగా, అందంగా ఉండే లెగ్‌ స్పిన్నర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిపై కాకుండా మిగతా బౌలర్లపై బ్యాటర్లు దృష్టిసారించారు. అప్పటికే అంతర్జాతీయంగా నేనూ కొన్ని మ్యాచ్‌లు ఆడి ఉన్నా. అయితే షేన్‌వార్న్‌ అద్భుతమైన డెలివరీలతో ఆకట్టుకున్నాడు. బలమైన వేళ్లు, భుజాలు, మంచి మోచేతి పవర్‌ షేన్‌వార్న్‌ సొంతం. ఆసీస్‌ పిచ్‌లు మొదట్లో స్పిన్‌కు సహకరించవు. మ్యాచ్‌ జరిగే కొద్దీ బంతి టర్న్‌ అవుతుంది. అయితే షేన్‌వార్న్‌ మాత్రం తొలి రోజు నుంచే బంతిని అవలీలగా టర్న్‌ చేసేవాడు’’ అని సచిన్‌ పేర్కొన్నాడు. 

గత సీజన్‌ మెగా టీ20 టోర్నీ ముగిశాక లండన్‌ వెళ్లినప్పుడు షేన్‌వార్న్‌ను చివరిసారిగా కలిశానని సచిన్‌ తెలిపాడు. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని, తనతో కలిసి గోల్ఫ్ కూడా ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు. ‘‘ 1992-93 సీజన్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా ఆసీస్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా షేన్‌వార్న్‌ను కలిశా. ఫాస్ట్‌ బౌలింగ్‌ అటాక్‌ చేసే ఆస్ట్రేలియాకు షేన్‌వార్న్‌ రూపంలో నాణ్యమైన స్పిన్నర్‌ దొరికాడు. ’’ అని బ్రియాన్‌ లారా గుర్తుచేసుకున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని