Sachin Tendulkar: ఆటలో వ్యక్తిగత దాడులొద్దు.. అర్ష్‌దీప్‌కు సచిన్‌ మద్దతు

ఆసియా కప్‌ సూపర్‌-4 పోరులో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ వదిలేసి విమర్శల పాలైన టీమ్‌ఇండియా యువ

Published : 07 Sep 2022 01:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియా కప్‌ సూపర్‌-4 పోరులో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ వదిలేసి విమర్శల పాలైన టీమ్‌ఇండియా యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌కు పలువురు క్రికెటర్లు, మాజీలు అండగా నిలుస్తున్నాడు. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూడా దీనిపై స్పందిస్తూ అర్ష్‌దీప్‌కు మద్దతుగా ట్వీట్‌ చేశారు. దేశం కోసం ఆడుతున్న క్రీడాకారులపై వ్యక్తిగత దాడులు తగవని సూచించాడు.

‘‘దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి అథ్లెట్‌ తనలోని అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ దేశం కోసమే ఆడుతాడు. అలాంటి వారికి మనం నిరంతర మద్దతు అందించాలి. గుర్తుంచుకోండి.. ఆటల్లో గెలుపోటములు సహజమే. కొన్ని సార్లు గెలవచ్చు. మరికొన్ని సార్లు ఓడిపోవచ్చు. అది క్రికెట్‌ అయినా మరే ఆటైనా సరే.. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉంచాలి. అర్ష్‌దీప్‌ సింగ్‌.. కష్టపడుతూనే ఉండు. మైదానంలో నీ ప్రదర్శనతో ఇలాంటి విమర్శలకు దీటైన సమాధానం ఇవ్వు. నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు భవిష్యత్‌ మరింత బాగుండాలి’’ అని సచిన్‌ రాసుకొచ్చారు.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్‌ రవి బిష్ణోయ్‌ వేసిన బంతిని పాక్ ఆటగాడు అసిఫ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి నేరుగా చేతుల్లోకి వచ్చినప్పటికీ అర్ష్‌దీప్‌ ఆ క్యాచ్‌ను చేజార్చాడు. దీంతో భారత్‌ మ్యాచ్‌ ఓడిపోవడానికి అతడి ఫీల్డింగ్‌ వైఫల్యమే కారణమని అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చివరి ఓవర్‌లో ఏడు పరుగులు కావాల్సి వచ్చినప్పుడు కీలక వికెట్‌ తీసి మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకెళ్లాడు. దీంతో పలువురు క్రికెటర్లు అతడికి అండగా నిలుస్తున్నారు. కోహ్లీ, హర్భజన్‌, సినీ రంగానికి చెందిన పలువురు అర్ష్‌దీప్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని