2011 Final: సచిన్‌ సెంటిమెంట్‌.. 2011 ఫైనల్‌ చూడలేకపోయిన సెహ్వాగ్‌

టీమ్‌ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ సాధించి అప్పుడే 11 ఏళ్లు గడిచాయి. శ్రీలంకపై నాటి సారథి మహేంద్రసింగ్‌ ధోనీ (91 నాటౌట్‌; 79 బంతుల్లో 8x4, 2x6) ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది...

Published : 02 Apr 2022 12:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాకు ఈ రోజు మరిచిపోలేని రోజు. ఎందుకంటే రెండోసారి వన్డే ప్రపంచకప్‌ సాధించి నేటికి 11 ఏళ్లు. శ్రీలంకపై నాటి సారథి మహేంద్రసింగ్‌ ధోనీ (91 నాటౌట్‌; 79 బంతుల్లో 8x4, 2x6) ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ముఖ్యంగా నువాన్‌ కులశేఖర వేసిన 48.2 బంతిని మహీ సిక్సర్‌గా మలిచిన తీరు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఆ అపురూప క్షణాలను మాజీ కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యాతగా అభివర్ణించిన మాటలు మన చెవ్వుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఈ మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్‌ 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇది క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు జీవితాశయం కూడా.

కాగా, ఈ మ్యాచ్‌కు సంబంధించి సచిన్‌, సెహ్వాగ్‌ల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే అది సచిన్‌ సెంటిమెంట్‌కు సంబంధించినది. ఇది చాలా సరదా విషయమే అయినా మనలో చాలా మందికి తెలిసి ఉండదు. అసలేం జరిగిందంటే.. నాటి ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. జట్టు స్కోర్‌ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. మలింగ నిప్పులు చెరిగే బంతులకు సెహ్వాగ్‌ (0), సచిన్‌ (18) పెవిలియన్‌ చేరారు. అయితే.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నా.. వీరిద్దరూ చూడలేకపోయారు. అందుకు సచినే కారణం.

సచిన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కి చేరాక తనతో పాటు సెహ్వాగ్‌నూ మిగిలిన మ్యాచ్‌ను చూడనివ్వలేదు. ఈ విషయాన్ని తెందూల్కరే ఒక సందర్భంలో స్వయంగా వెల్లడించాడు. ‘‘అంతకుముందు అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌ రోజు.. నేను డ్రెస్సింగ్‌రూమ్‌లో తలకు మసాజ్‌ చేసుకుంటుండగా వీరూ నా పక్కనే కూర్చున్నాడు. ఆరోజు టీమ్‌ఇండియా బాగా ఆడి విజయం సాధించింది. దాంతో ఫైనల్‌ రోజు కూడా నేను ఔటయ్యాక వెళ్లి మసాజ్‌ టేబుల్‌ మీద కూర్చున్నాను. నా పక్కనే సెహ్వాగ్‌నూ కూర్చోమని చెప్పా. అప్పుడు అతడు.. ‘కొంచెంసేపైనా నన్ను మ్యాచ్‌ చూడనివ్వు’ అని అడిగాడు. నేను కుదరదని చెప్పా. కావాలంటే తర్వాత ఎన్నిసార్లు అయినా టీవీలో ఈ మ్యాచ్‌ను చూసుకో అని చెప్పాను. చివరికి మేం విజయం సాధించాం’ అని సచిన్‌ నాటి సరదా సంఘటనను బయటపెట్టాడు.

ఇక ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ ఔటయ్యాక గౌతమ్‌ గంభీర్‌ (97; 122 బంతుల్లో 9x4), విరాట్‌ కోహ్లీ (35; 49 బంతుల్లో 4x4) మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.. గంభీర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 109 పరుగుల శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలోనే గంభీర్‌ శతకానికి చేరువైన వేళ ఔటయ్యాడు. అయితే, తర్వాత యువరాజ్‌ (21 నాటౌట్‌; 24 బంతుల్లో 2x4)తో కలిసి ధోనీ మ్యాచ్‌ను పూర్తి చేశాడు. దీంతో భారత్‌కు అతిగొప్ప విజయం అందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ధోనీ ఉపయోగించిన బ్యాట్‌ను తర్వాత వేలం వేయగా.. అది రికార్డు ధర పలికింది. అప్పట్లో ఆర్కే గ్లోబల్‌ అనే సంస్థ దీన్ని రూ.72 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని ధోనీ భార్య సాక్షికి చెందిన ఓ ఛారిటబుల్‌ ట్రస్టుకు వినియోగించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని