Sachin: అతడు బ్యాటింగ్‌తోనూ వికెట్లు తీస్తాడు.. అందుకే ఆ షాట్‌ ఇష్టం లేదు: సచిన్‌

సచిన్‌ తెందూల్కర్ (Sachin Tendulkar) రికార్డుల రారాజు. క్రికెటింగ్‌ షాట్లకు మారు పేరు. గొప్ప గొప్ప బౌలర్లకు సింహస్వప్నం. అలాంటి సచిన్‌ను కూడా ఆందోళనకు గురి చేసిన షాట్‌ ఒకటుంది. అయితే అది అతడు ఆడితే కాదంట. తాను నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్నప్పుడు.. స్ట్రైకర్‌ ఆడితేనే కాస్త భయపడతాడంట..

Updated : 22 Jan 2023 14:55 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ పుస్తకంలోని అన్ని రకాల షాట్లను అలవోకగా కొట్టిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌. ఎన్నో రికార్డులను సొంతం చేసుకొన్న క్రికెట్ దేవుడు. అయితే అతడికి కూడా ఓ షాట్‌ అంటే మాత్రం ఇష్టం లేదట. దానికి కారణం అలాంటి షాట్‌కు సచిన్‌ రనౌట్‌ కావడమే. అదేంటి మైదానం నలువైపులా కొట్టే సచిన్‌ను కూడా భయపెట్టేలా షాట్ ఆడిన ఆ బ్యాటర్‌ ఎవరో తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే..

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్, జాబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రా, ఆర్పీ సింగ్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సచిన్‌తో ఆడినప్పటి సంగతులను మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌ గుర్తు చేసుకొన్నాడు. ‘‘నేను బౌలింగ్‌ చేసేటప్పుడు దాదాపు ఎవరిని రనౌట్‌ చేసినట్లు గుర్తులేదు. కానీ బ్యాటింగ్‌ సమయంలో కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్‌ దెబ్బకు నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న దిగ్గజ క్రికెటర్‌ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు’’ అని సచిన్‌ను రనౌట్‌ చేసిన దానిపై ఆర్పీ సింగ్‌ క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆకాశ్‌ చోప్రా కూడా సారీ అంటూ సచిన్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఆకాశ్ చోప్రా ట్వీట్‌కు సచిన్‌ తెందూల్కర్‌ స్పందించాడు. ‘‘ఒక్కసారిగా, నా ఇష్టమైన షాట్ల జాబితాలో స్ట్రెయిట్‌ డ్రైవ్‌ లేకుండా పోయింది. ఆర్పీ సింగ్‌ బ్యాటింగ్‌తోనూ వికెట్లు తీయగలడు’’ అని నవ్వుతున్న ఎమోజీని సచిన్‌ పోస్టు చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని