Sachin- Gill: శుభ్‌మన్‌గిల్ శతకం ఎవరికి సాయపడిందంటే ?

శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ బాదడతో గుజరాత్‌ టైటాన్స్‌ (GT) చేతిలో ఆర్సీబీ (RCB) ఓటమిని చవిచూసింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గిల్‌ను సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) అభినందించాడు.

Published : 22 May 2023 20:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్‌ లీగ్‌ దశలో ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ఏకంగా మూడు సెంచరీలు నమోదయ్యాయి. సన్‌రైజర్స్‌పై కామెరూన్‌ గ్రీన్ శతకం బాదడంతో రెండు ఓవర్లు మిగిలుండగానే ముంబయి ఇండియన్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది.  బెంగళూరు, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) శతకాలతో సత్తా చాటారు. వీరిద్దరూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలు సాధించడం విశేషం. విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేయడంతో గుజరాత్‌పై ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. అయితే, ఛేదనలో గిల్ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. గిల్ ఒకరకంగా ముంబయి ఇండియన్స్‌కు మేలు చేశాడని చెప్పాలి. అతడు సెంచరీ చేయడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ ఆశలు ఆవిరై ముంబయి ముందంజ వేసింది. 

ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు, ఫ్యాన్స్‌ శుభ్‌మన్‌ గిల్‌కు థ్యాంక్స్‌ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముంబయి ఇండియన్స్ మెంటార్‌ సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) కూడా శుభ్‌మన్‌ ఆటతీరును మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ‘ముంబయి ఇండియన్స్ కోసం కామెరూన్‌ గ్రీన్‌, శుభ్‌మన్‌ గిల్ బాగా బ్యాటింగ్‌ చేశారు. గుజరాత్‌పై విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో బ్యాక్‌ టూ బ్యాక్‌ సెంచరీలు సాధించాడు. ముంబయిని ప్లేఆఫ్స్‌లో చూడటం సంతోషంగా ఉంది. ముంబయి ఇలానే విజయాలతో ముందుకెళ్లాలి’ అని సచిన్‌ తెందూల్కర్ ట్వీట్ చేశాడు. 

గిల్‌ను అభినందించిన గంగూలీ.. నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్‌

ఆర్సీబీపై సెంచరీ బాది జట్టు (గుజరాత్‌)కు విజయాన్ని అందించిన శుభ్‌మన్‌ గిల్‌ను బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) ట్విటర్ వేదికగా అభినందించారు. అయితే, వరుసగా రెండు సెంచరీలు బాదిన కోహ్లీని గంగూలీ అభినందించకపోవడంతో విరాట్ ఫ్యాన్స్‌ నిరాశకు గురువుతున్నారు. గిల్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఆటగాడిని గంగూలీ మర్చిపోయాడని ఓ ట్విటర్‌ యూజర్ ట్వీట్ చేయగా.. ‘కోహ్లీ కూడా వరుసగా రెండు సెంచరీలు చేశాడు దాదా.. మీరు మాత్రం శుభ్‌మన్‌ గిల్‌ గురించే మాట్లాడుతున్నారు’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘ఎవరు ప్రశంసించినా, ప్రశంసించకపోయినా కింగ్‌ కోహ్లీ ఎప్పటికీ గొప్ప ఆటగాడు’ అని ఓ యూజర్‌ ట్వీట్ చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని