Sachin Tendulkar: అర్జున్‌పై ఆ ఒత్తిడి వద్దు.. కుమారుడి తొలి శతకంపై స్పందించిన సచిన్‌

అర్జున్‌ ఆటలో రాణించాలంటే అతడు ముందుగా క్రికెట్‌తో ప్రేమలో పడాలని సచిన్‌(Sachin Tendulkar) తెలిపాడు. అందుకు అతడికి కొంత సమయం ఇవ్వాలని సూచించాడు. 

Updated : 16 Dec 2022 15:07 IST

దిల్లీ: గోవా తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న అర్జున్‌ తెందూల్కర్‌ గుజరాత్‌పై తన తొలి మ్యాచ్‌లో రంజీ శతకాన్ని నమోదు చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు, సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 1988 రంజీ(Ranji Trophy) అరంగేట్ర మ్యాచ్‌లో సచిన్‌ తెందూల్కర్‌ సైతం  ఇదే విధంగా శతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా తన కుమారుడి విషయంలో సచిన్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్జున్‌(Arjun Tendulkar)పై ఒత్తిడి లేకుండా చూసేందుకే తాను ప్రయత్నిస్తానని అన్నాడు. అందరిలాగా తన కుమారుడు సాధారణ బాల్యం గడపలేదని తెలిపాడు. అతడు క్రికెట్‌ను ఇంకా ఆస్వాదించాలని.. ఇప్పుడే అంచనాల పేరుతో అతడిని ఒత్తిడికి గురిచేయడం తనకు ఇష్టం లేదని సచిన్‌(Sachin Tendulkar) పేర్కొన్నాడు. 

‘‘మ్యాచ్‌లో అతడి ప్రదర్శన తర్వాత ఎంతో మంది ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అవన్నీ అర్జున్‌ను ఒత్తిడికి గురిచేస్తాయి. ఎందుకంటే, నేను మా తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ అటువంటిది ఎదుర్కోలేదు. నాకు నచ్చింది చేసే స్వేచ్ఛను  వారు ఇచ్చారు.  అందుకే నాపై ఒత్తిడి ప్రభావం ఉండేదికాదు. వారి మద్దతు, ప్రోత్సాహాన్ని మాత్రమే నాకు అందించేవారు. అది నన్ను నేను మరింత మెరుగుపరిచేందుకు తోడ్పడింది. నా కుమారుడి విషయంలోనూ నేను అదే చేయాలనుకుంటాను. నాలాంటి ఓ క్రికెట్‌ సెలబ్రిటీ కుమారుడిగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. నేను తనకెప్పుడూ అదే చెప్తుంటాను. అర్జున్‌ను క్రికెట్‌తో ప్రేమలో పడనివ్వండి. అందుకు అతడికి కొంత సమయం ఇవ్వండి. ఆట నుంచి రిటైర్మెంట్‌ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ నేను ఇదే సందేశాన్ని ఇచ్చాను’’ అంటూ సచిన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని